చిన్నారులకు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్న అంగన్‌వాడీ టీచర్
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్‌వాడీ కేంద్రాలను అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిని ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు’గా మార్చి.. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆంగ్ల విద్యనూ అందిస్తోంది. ఈ ‘బాల బడులు’ కొత్త రూపు సంతరించుకుంటుండటంతో చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా అక్షరాలు దిద్దుకోవడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఎనలేని సంతోషాన్ని నింపుతోంది.
– కర్నూలు (రాజ్‌విహార్)
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 8,047 కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో 4,706 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.14 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో రూ.10.20 లక్షలతో భవన నిర్మాణ పనులు, రూ.2.80 లక్షలతో విద్యుత్, నీటి సౌకర్యం, ఫర్నిచర్, రూ.99 వేలతో టాయిలెట్లు, ఇంటర్నల్ పనులు చేయనున్నారు. అలాగే 3,341 కేంద్రాలను ఆధునికీకరిస్తారు. వీటిలో భవనాల అప్‌గ్రేడేషన్‌తో పాటు మౌలిక సదుపాయాలు, విద్యాబోధనకు అవసరమైన వసతులు కల్పిస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కో కేంద్రానికి రూ.50 వేల నుంచి రూ.5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.
పనుల బాధ్యత గృహ నిర్మాణ సంస్థకు..
అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే పనులను గృహ నిర్మాణ సంస్థకు అప్పగించారు. గడువులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. నాణ్యతపై ప్రశ్నించేందుకు వీలుగా బాలల తల్లులనూ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోంది. ప్రతి అంగన్‌వాడీకి ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేస్తోంది. కన్వీనర్‌గా సూపర్‌వైజర్, సభ్యులుగా అంగన్‌వాడీ టీచర్, గ్రామ/వార్డు మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వయసున్న చిన్నారుల తల్లులు ముగ్గురు ఉంటారు. ఈ కమిటీ పేరున బ్యాంకు ఖాతా తెరిచి.. ఇద్దరికి చెక్ పవర్ ఇస్తారు. వీరి ద్వారానే అవసరమైన నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది.
ప్రారంభమైన ఆంగ్ల బోధన
అంగన్‌వాడీల్లో 3నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచే ఇంగ్లిష్ బోధిస్తున్నారు. పిల్లల్లో ఆసక్తి పెంచేలా ఆట వస్తువులు, బొమ్మలతో చదువు నేర్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ రూపొందించడంతో పాటు సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3–6 ఏళ్ల మధ్య వయసున్న 10,88,461 మంది చిన్నారులు ఏబీసీడీలు దిద్దుతున్నారు.
చిన్నారుల్లో నూతనోత్తేజం
ఐదేళ్లలోపు చిన్నారులకు గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఈ సమయంలో విద్యాపరమైన, మంచి విషయాలను చక్కగా గ్రహిస్తారు. అందుకే వాళ్లకు నాణ్యమైన ఆహారంతో పాటు మంచి విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. అందుకు తగ్గట్టుగా సిబ్బందికి అందరికీ శిక్షణ ఇచ్చాం.
– కృతికా శుక్లా, స్టేట్ డైరెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
ఆడిస్తూ.. పాడిస్తూ..
పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వారిని ఆడిస్తూ, పాడిస్తూ విద్య నేర్పిస్తున్నాం. మాకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే పిల్లలకు ఇంగ్లిష్ నేర్పిస్తున్నాం. పిల్లల్లో ఆసక్తి కలిగేలా వస్తువులు, బొమ్మలతో బోధిస్తున్నాం.
– శ్రీదేవి, అంగన్‌వాడీ టీచర్, కర్నూలు
భవనాలు నిర్మిస్తే కొత్త లుక్
అంగన్‌వాడీ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దీనివల్ల సౌకర్యాలు ఏర్పడి కొత్త లుక్ వస్తుంది. అలాగే ఇంగ్లిష్ బోధించడం వల్ల పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుంది.
– తరంగిణి, చిన్నారి తల్లి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment