సాక్షి, అమరావతి: చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసేలా.. వారికి సంపూర్ణ పోషణ, సమగ్ర విద్య అందించేలా ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు బడిబాట పట్టనున్నాయి. ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించనున్నారు. వీటిని ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహించనున్నారు.
తొలి దశలో 5,664 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నారు. ఇందుకోసం 3,824 ప్రాథమిక పాఠశాలల ఆవరణలో 6,692 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న 1,20,165 మంది చిన్నారుల విద్యకు బలమైన పునాది పడనుంది. తొలిదశలో చేపట్టే తరగతి గదుల నిర్మాణాన్ని 2021–2022 మధ్యలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.669.20 కోట్లు ఖర్చు చేయనుంది.
భవితకు బలమైన పునాది
బాలల భవితకు బలమైన పునాది వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ఫౌండేషన్ స్కూళ్లుగా వాటిని మార్పు చేస్తున్నారు. తొలి దశలో 5,664 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల తరహాలోనే ఫౌండేషన్ పాఠశాలలు బాలలకు అన్ని సౌకర్యాలు, మంచి విద్య అందిస్తాయి. అంగన్‌వాడీల్లో అందించే సంపూర్ణ పోషణ పథకాన్ని ఫౌండేషన్ పాఠశాలల్లోనూ అమలు చేస్తాం. ఆటపాటలతోపాటు బలమైన ఆహారం, ఆరోగ్యం, విద్యకు కేంద్రంగా ఇవి ఉంటాయి.
– కృతికా శుక్లా, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment