
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌పై, ఆధునిక వ్యాపార విధానాలపై పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకుంటోంది. 2020–21 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు ఇళ్ల నుంచే కొనుగోళ్లు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో ఈ–కామర్స్‌కు ఊతం లభించిందని పేర్కొంది.
ఇంటర్నెట్ వినియోగం .. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు పెరగడం, ఆకర్షణీయమైన పథకాలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, వేగవంతమైన డెలివరీలు మొదలైనవి ఈ విభాగం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు దోహదపడుతున్నాయని ఐటీసీ అభిప్రాయపడింది. ఇలాంటి అంశాలన్నింటి తోడ్పాడుతో గత నాలుగేళ్లుగా తమ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొంది. డోమినోస్, స్విగ్గీ, జొమాటో, డుంజో వంటి సంస్థలతో చేతులు కలపడం ద్వారా వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత పెరిగిందని ఐటీసీ తెలిపింది. ’ఐటీసీ స్టోర్ ఆన్ వీల్స్’ మోడల్‌తో 13 నగరాల్లో 900 పైగా రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రారంభించిన ఐటీసీ ఈ–స్టోర్‌కు మంచి స్పందన లభిస్తోందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత వేగవంతంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.