ఐటీ ఉద్యోగుల్లో 65 శాతం పనికిరారు! | Capgemini India CEO says 65% of IT employees not re-trainable | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల్లో 65 శాతం పనికిరారు!

Published Mon, Feb 20 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ఐటీ ఉద్యోగుల్లో 65 శాతం పనికిరారు!

ఐటీ ఉద్యోగుల్లో 65 శాతం పనికిరారు!

వాళ్లకు శిక్షణ ఇవ్వడం అతిపెద్ద సవాల్‌...
కొత్త టెక్నాలజీలతో భారీగా ఉద్యోగాల కోత!
క్యాప్‌జెమిని ఇండియా చీఫ్‌ శ్రీనివాస్‌  


ముంబై: డిజిటల్‌ యుగంవైపు వేగంగా అడుగులేస్తున్న  సమాచార సాంకేతిక(ఐటీ) రంగం.. ఉద్యోగాలకు మాత్రం ఎసరుపెడుతోంది. డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటంతో ఐటీ పరిశ్రమలో పని ధోరణి కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఉద్యోగుల్లో చాలా మంది కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కష్టమేనని దిగ్గజ ఐటీ సంస్థ క్యాప్‌ జెమిని అంటోంది. ప్రధానంగా మధ్య, సీనియర్‌ స్థాయిలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు దారితీయొచ్చని కంపెనీ ఇండియా సీఈఓ శ్రీనివాస్‌ కందుల హెచ్చరించారు. ‘నేను మరీ అంత నిరాశావాదిని కాను.

 అయితే, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 60–65 శాతం మందికి కొత్త తరం టెక్నాలజీలకు అనుగుణంగా శిక్షణ కూడా ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. పరిశ్రమకు ఇది చాలా పెద్ద సవాలే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌జెమినీలో ప్రస్తుతం దేశీయంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్‌లో పెద్ద సంఖ్యలోనే ఐటీ ఉద్యోగాల కోత ఉండొచ్చని.. మధ్య, సీనియర్‌ స్థాయిలో తొలగింపులు అత్యధికంగా చోటుచేసుకోవచ్చని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీలకు అనుగుణంగా ఇప్పుడున్న ఐటీ ఉద్యోగుల్లో 15 లక్షల మందికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాజాగా పరిశ్రమ చాంబర్‌ నాస్కామ్‌ చెప్పడం తెలిసిందే.

నాసిరకం ఇంజనీరింగ్‌ కాలేజీల వల్లే...
‘ఇప్పుడు పరిశ్రమలో ఉన్న 39 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా సరైన విద్యా ప్రమాణాల్లేని (తక్కువ గ్రేడ్‌ ఉన్నవి) ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదివినవారే. దీంతో వాళ్ల నైపుణ్యాలు పెద్దగా పనికిరావడం లేదు. ఐటీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు్ల మార్జిన్లపైనే ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలను సానపట్టడంపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు’ అని ఆయన వివరించారు. ఇలాంటి నాసిరకం కాలేజీల నుంచి ఇప్పు డు ఎక్కువ మంది విద్యార్ధులు ఐటీ రంగంలోకి అడుగుపెడుతున్నారని.. ఈ నేపథ్యంలో వాళ్లకు జీతాలు పెంచడంవల్ల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ‘దశాబ్ద కాలం క్రితం ఐటీ కంపెనీల్లో కొత్తగా చేరేవారికి(ఫ్రెషర్లు) రూ.2.25 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌ చేసేవాళ్లు.

 ఇప్పుడు ఇది కేవలం రూ.3.5 లక్షలకు మాత్రమే పెరిగింది. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ వేతనాలు భారీగా తగ్గిపోయినట్లు లెక్క. మేధస్సు ఆధారిత పరిశ్రమగా చెప్పుకున్న ఐటీ రంగంలో ఉద్యోగులకు ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను కల్పించడం అతిపెద్ద సవాల్‌’ అని  పేర్కొన్నారు. 80 శాతం మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఉద్యోగాలకు పనికిరారంటూ ‘ఆస్పైరింగ్‌ మైండ్స్‌’ అనే సంస్థ అధ్యయన నివేదిక కొద్ది నెలల క్రితం వెల్లడించిన నేపథ్యంలో శ్రీనివాస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తాము ఫ్రెషర్ల నియామకానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ తాజాగా ఆయన పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement