సైబర్‌ సవాలు | Sakshi Editorial On Cyber Crimes and fraudsters | Sakshi
Sakshi News home page

సైబర్‌ సవాలు

Published Wed, Oct 30 2024 12:08 AM | Last Updated on Wed, Oct 30 2024 12:08 AM

Sakshi Editorial On Cyber Crimes and fraudsters

అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్‌ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్‌ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్‌ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్‌ అరెస్ట్‌ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. 

కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్‌ కీ బాత్‌’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్‌ అరెస్ట్‌ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

బాధితులను ముందుగా ఫోన్‌లో సంప్రతించడం, మీ ఆధార్‌ నంబర్‌ – ఫోన్‌ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్‌ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్‌ అరెస్ట్‌’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్‌ అరెస్ట్‌ మోసాల’ వ్యవహారశైలి. 

మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులుగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. 

డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్, ట్రేడింగ్‌ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్‌ యాప్‌ల స్కామ్‌... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్‌ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 

2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్‌ మధ్య డిజిటల్‌ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. 

అలాగే, ట్రేడింగ్‌ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్‌ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్‌ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!

గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్‌ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్‌ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్‌ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. 

అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. 

ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్‌’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్‌ కాల్, వీడియో కాల్‌ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్‌ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. 

క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్‌ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. 

అన్ని రకాల సైబర్‌ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్‌ మోసాలకు సరైన విరుగుడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement