అతి ‘స్మార్ట్‌’ అనర్ధమే..! | Smartphones and other technology goods Addiction is danger to us | Sakshi
Sakshi News home page

అతి ‘స్మార్ట్‌’ అనర్ధమే..!

Apr 22 2018 2:20 AM | Updated on Apr 22 2018 2:20 AM

Smartphones and other technology goods Addiction is danger to us - Sakshi

డిజిటల్‌ అడిక్షన్‌ అదేనండీ.. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్‌ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారుతోందా..? మనమంతా వాటికి బానిసలుగా మారే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామా? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగం నాడీ మండలంలో మార్పులకు కారణమవుతోందని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా తలమునకలైతే ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతోపాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే ‘న్యూరో రెగ్యులేషన్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది. 

ప్రతీక్షణం.. పక్కనే ఉండాలి
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే మెసేజ్‌ అలర్ట్‌ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళనతో పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది. సిగరెట్ల మాదిరిగానే డిజిటల్‌ టెక్నాలజీ కూడా ఓ వ్యసనంగా మారేలా రూపొందించారని నిఫుణులు భావిస్తున్నారు. వివిధ రూపాల్లో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్‌లు, వైబ్రేషన్లు, అలర్ట్‌ల పట్ల ఏదో ప్రమాదం సంభవిస్తుందేమో అన్నట్టుగా చాలామంది స్పందిస్తున్నారు. ఒకవైపు తమ మనసులోని భావాలను ఫోన్‌ ద్వారా కమ్యూనికేట్‌ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు(మల్టీటాస్కింగ్‌) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్‌ కావడంలేదు. దాంతో చురుకుదనం మందగిస్తోంది. ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్‌ఫ్రాన్సిస్‌కో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతీ చిన్న విషయానికి స్మార్ట్‌ఫోన్లపైనే ఆధారపడటం ఎక్కువైపోయింది. మనలో 40 శాతానికిపైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్‌ చేసుకుంటున్నట్టు, యాభై శాతానికిపైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 

గేమింగ్‌ డిజార్డరే అంటున్న డబ్ల్యూహెచ్‌ఓ
పరిసరాలను పట్టించుకోకుండా నిరంతరం వీడియోగేమ్‌ల్లో మునిగిపోయే‘గేమింగ్‌ డిజార్డర్‌’ను కూడా ‘రివిజన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డిసీజెస్‌’(ఐసీడీ–11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చేర్చనుంది. దీనిలోభాగంగా ఈ డిజార్డర్‌ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ(ఇంటర్నేషనల్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డిసీజెస్‌) జాబితాలో ప్రచురించనుంది. ప్రపంచంలోని ఆరోగ్య పోకడలు, సమస్యల తీరును గుర్తించి, వాటి నిర్థారణతోపాటు వర్గీకరణకు ఉద్ధేశించి ఐసీడీ–11ను ఓ ప్రామాణిక సాధనంగా డాక్టర్లు, పరిశోధకులు, ఎపిడమియోలాజిస్ట్‌లు ఉపయోగిస్తున్నారు. 

భారత్‌లో పరిస్థితి ఇదీ.. 
మనదేశంలో తొలిసారిగా 2016లో ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు ఈ గేమింగ్‌ డిజార్డర్‌ను గుర్తించారు. సైకియాట్రీ వార్డులో 22, 19 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు నెలపాటు చికిత్స తీసుకున్నారు. వారి తల్లిదండ్రులు వైద్యుల సహాయం కోరే నాటికే కొన్నిరోజులపాటు తిండి, నిద్ర అనే ఆలోచన లేకుండా ఎడతెగని గేమింగ్‌ కారణంగా ఈ యువకులు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తువలో మునిగిపోయారు. 

అధిగమించేందుకు ఏం చేయాలి? 
- స్మార్ట్‌ఫోన్లలోని అలర్ట్‌లు, నోటిఫికేషన్లను ఆపేయాలి. 
- ఆన్‌లైన్‌ కంటే ఆఫ్‌లైన్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టాలి. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంభాషించాలి.
- నిద్రపోవడానికి గంట ముందు అన్ని పరికరాలు ఆఫ్‌ చేసేయాలి లేదా మరో గదిలో ఫోన్‌ను ఉంచాలి. ఎందుకంటే ఫోన్లలోని‘బ్లూ వేవ్‌ లెంథ్‌ లైట్‌’ మెదడులో నిద్రకు సమయం ఆసన్నమైనదని సూచించే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. 
- రాత్రి భోజనమప్పుడు ఫోన్‌ ఆఫ్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ ఇంటి వద్దే వదిలేసి కొంతదూరం నడవాలి.
- ప్రతీ చిన్న విషయానికి వెబ్‌లో సెర్చ్‌ మానుకోవాలి 
- ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్‌ వంటి వాటిలో మునిగిపోకుండా సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ పాటించాలి. 
- కంప్యూటర్‌ లేదా మొబైల్‌ చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలో కనీసం 30 పేజీలు చదివాకే వాటిని ముట్టుకోవాలని మనం సవాల్‌ చేసుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement