‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో ప్రపంచ మొత్తం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రి మేధ(ఏఐ)ని ఉపయోగించుకొనే విషయంలో స్పష్టమైన విధివిధానాలు అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొనే అంశంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకొనే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రత, గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్–డబ్ల్యూటీఎస్‌ఏ, ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను మోదీ ప్రారంభించారు.
డిజిటల్ సాంకేతికత విషయంలో నిబంధనల ఆధారిత ఫ్రేమ్‌వర్క్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయి సంస్థలు గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు కేవలం వ్యక్తిగత భద్రత, టెక్నాలజీ సంస్థల పారదర్శకతకే కాదు, అంతర్జాతీయ డేటా ప్రవాహంపై ఆధారపడి ఉన్న వాణిజ్యం, వస్తు సేవలకు సైతం కీలకమేనని ఉద్ఘాటించారు. సైబర్ మోసాల నుంచి ఏ ఒక్క దేశమూ ఒంటరిగా తమ ప్రజలకు రక్షణ కలి్పంచలేదని అభిప్రాయపడ్డారు.
అందుకే అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అంతర్జాతీయ సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. 95 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఏకంగా 40 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని వివరించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విషయంలో తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment