న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం (డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్) తయారీ రంగ కంపెనీలకు ముఖ్యమైన అజెండాగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. 54 శాతం కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసినట్టు తెలిసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అనలైటిక్స్‌ను తమ వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేశాయి. తద్వారా అవి సమర్థతను పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి.
భారత తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్లో పనిచేసే సంస్థలు, బహుళజాతి సంస్థల (ఎంఎన్‌సీలు) చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ (సీఎక్స్‌వో)లను సర్వేలో భాగంగా ప్రశ్నించి తయారీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ముఖచిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా జరిగింది.
‘‘భారత తయారీ కంపెనీలు అన్ని ప్లాంట్లకు ఒకే ప్రామాణిక డిజిటల్ పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వివిధ తయారీ కేంద్రాలకు భిన్నమైన డిజిటల్ పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. భారత్‌లో తయారీ కంపెనీలు అనలైటిక్స్, ఏఐను కంపెనీలు అమలు చేస్తున్నాయి. వీటి అమలు రేటు 54 శాతంగా ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది.
తమ వ్యాపారాల్లో డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే ప్రణాళికేదీ లేదని సర్వేలో పాల్గొన్న 38 శాతం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. ఆరు రంగాల్లోని డిజిటల్ ఛాంపియన్లు పారదర్శకత, సుస్థిరత భవిష్యత్తు వృద్ధికి తమను సన్నద్ధంగా ఉంచుతాయని భావిస్తున్నాయి. గొప్ప ఆవిష్కరణలు, వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం పోటీలో తమను నిలిపి ఉంచుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.
సవాళ్లను అధిగమించేందుకు..
నిర్వహణ సవాళ్లను అధిగమించేందుకు భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా కొంత వరకు సామర్థ్యాన్ని కంపెనీలు సిద్ధం చేసుకోగా, కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉందని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ ఆపరేషన్స్ లీడర్ అంకుర్ బసు తెలిపారు. ‘‘సంస్థలు తయారీ ప్రక్రియల్లో సమర్థతను పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఖరీదైన యంత్రాల నిర్వహణను వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. తయారీని ఆటోమేషన్ చేస్తున్నాయి. వర్క్‌స్టేషన్లను ఐవోటీతో అనుసంధానిస్తున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ సుదీప్తఘోష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment