Virtual Fashion Week: వర్చువల్‌ ఎంపిక | Fashion Industry Digital Transformation: Manish Malhotra, Ritu Kumar Virtual Fashion Week | Sakshi
Sakshi News home page

Virtual Fashion Week: వర్చువల్‌ ఎంపిక

Published Fri, Apr 16 2021 6:47 PM | Last Updated on Fri, Apr 16 2021 6:52 PM

Fashion Industry Digital Transformation: Manish Malhotra, Ritu Kumar Virtual Fashion Week - Sakshi

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగినప్పటికీ నిశితంగా పరిశీలిస్తే మొత్తం లగ్జరీ ఫ్యాషన్‌ అమ్మకాలు 8  నుండి 10 శాతం మాత్రమే ఉందని నిపుణుల అంచనా. ఫలితంగా ప్రఖ్యాత డిజైనర్లు సైతం వర్చువల్‌కి మారారు. ర్యాంప్‌వాక్‌లతో ధగధగలాడే ఫ్యాషన్‌ షోలు సైతం వర్చువల్‌ దారిలోకి వచ్చేశాయి. అటు నుంచి టైలరింగ్, డిజైనింగ్‌లో శిక్షణ కూడా డిజిటల్‌లో వెలుగుతోంది. ఇప్పటికే ప్రఖ్యాత డిజైనర్లు మనీష్‌ మల్హోత్రా, రితుకుమార్, రీనా ఢాకా, బినా రమణి, సమంతా చౌహాన్,.. వంటి వారెందరో వర్చవల్‌ వేదికకు రంగం సిద్ధం చేసుకున్నారు. విదేశాలలో ఊపందుకున్న వర్చువల్‌ రియాలిటీ ఇప్పుడు దేశీయంగానూ ఫ్యాషన్‌ రంగంపై తన ప్రభావాన్ని చూపుతోంది. 

ఫ్యాషన్‌ షోలు
ఫ్యాషన్‌ షో అనగానే జిగేల్మనే లైట్లు, మోడళ్ల మెరుపులు, ర్యాంప్‌వాక్‌లు, ఆహుతుల చప్పట్ల హోరు గ్రాండ్‌గా కళ్ల ముందు నిలుస్తుంది. మహమ్మారి కారణంగా ర్యాంప్‌ వేదికలు వర్చువల్‌గా మారాయి. ర్యాంప్‌లను గ్రీన్‌ స్క్రీన్‌లతో రియల్‌ టైమ్‌ కంపోజిషన్స్‌ భర్తీ చేశారు. ఇప్పుడు ఎవ్వరైనా తమ గదిలో కూర్చునే డిజిటల్‌లో ఈ ర్యాంప్‌ షోలను వీక్షించవచ్చు.  ఇండియా కొచర్‌ వీక్, బ్లెండర్స్‌ ఫ్యాషన్‌ ప్రైడ్, ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్‌ షో కూడా వర్చువల్‌లోనే నడిచింది. ఇవన్నీ దేశ విదేశాల నుండి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవే.  వర్చువల్‌లో లో దుస్తులు, ఇతర సౌందర్య సాధనాలు, మేకప్‌ లుక్స్‌ కూడా ప్రదర్శించడం, వాటిని కోట్లాదిమంది వీక్షించడం ప్రస్తుత ట్రెండ్‌కు నిదర్శనంగా ఉంది.  

షాపింగ్‌
లగ్జరీ డిజైన్స్‌ సృష్టించే డిజైనర్లు్ల కేవలం ఆన్‌లైన్‌ అమ్మకాల ద్వారా ప్రయోజనం పొందలేమని గుర్తించారు. కస్టమర్లు నేరుగా షాప్‌ను సందర్శించి, డిజైన్లు చూసే అనుభూతిని పొందుతారని, అప్పుడే వారు ఆర్డర్లు ఇవ్వడానికి, కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని గ్రహించారు. కోవిడ్‌ కారణంగా ప్రస్తుతం వినియోగదారుడిని నేరుగా షాప్‌కి రప్పించలేని పరిస్థితి. ఫలితంగానే భారతీయ ఫ్యాషన్‌ పరిశ్రమ కొనుగోలు విధానంలో వర్చువల్‌ మార్పు బాణంలా దూసుకొచ్చింది. ఇండియాలో మొదటిసారి పూర్తి వర్చువల్‌ స్టోర్‌ను మనీష్‌ మల్హోత్రా ప్రారంభించాడు. ఆ తర్వాత అదే దారిలో ప్రఖ్యాత డిజైనర్లు ప్రయాణిస్తున్నారు. గ్రాండ్‌గా డిజైన్‌ చేసే బ్రైడల్‌ దుస్తుల డిజైనర్లు ఇదే కోవలో పయనిస్తున్నారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్‌బాటలో నడుస్తోందన్నది డిజైనర్ల అభిప్రాయం. 

డిజైనింగ్‌ క్లాసులు
టైలరింగ్‌కు వర్చువల్‌ క్లాసులు తలుపులు తెరిచాయి. సాధారణ స్థానిక టైలరింగ్‌ నుంచి ప్రసిద్ధ డిజైనర్ల వరకు ఆన్‌లైన్‌ వేదికగా క్లాసులు తీసుకుంటున్నారు. ఫ్యాషన్‌ అకాడమీలు కూడా ఇదే బాట పట్టాయి. విద్యార్థులకు ఇచ్చే క్లాసులన్నీ ఆన్‌లైన్‌ వేదిక అయినట్టుగానే  ఫ్యాషన్‌ క్లాసులూ డిజిటల్‌ అయ్యాయి. డ్రెస్‌ డిజైన్స్, ఇలస్ట్రేషన్లు, ఎంబ్రాయిడరీ, కటింగ్‌ పద్ధతులు.. వంటివి వర్చువల్‌ క్లాసులు జరుగుతున్నాయి. వీటికి డిజైనర్‌ను బట్టి కొంత మొత్తం చెల్లించి, అటెండ్‌ అవ్వచ్చు. ఒక రోజు నుంచి మొదలయ్యే ఆన్‌లైన్‌ వర్క్‌షాప్స్‌కి అటెండ్‌ అయ్యి డిజిటల్‌లోనే నేర్చుకోవచ్చు. 

ఆసక్తిగా డిజైనింగ్‌
ప్రస్తుత కాలం ఫ్యాషన్‌ షోలు, షాపింగ్‌ కొంతవరకు సరైనదే. అయితే, సాధారణంగా మనం ఫ్యాబ్రిక్‌ని టచ్‌ చేస్తే ఉండే ఫీల్‌ డిజిటల్‌లో చూస్తే రాదు. డిజిటల్‌లో ఫ్యాబ్రిక్‌ టెక్స్‌చర్‌ తెలుసుకోవడమూ కష్టమే. కాకపోతే డిజిటల్‌లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు అవతలి వ్యక్తి అటెన్షన్‌ ఏ విధంగా ఉందనే విషయం అంతగా తెలియడం లేదు. అవతలి వ్యక్తి మనం చెప్పే విషయం పట్ల ఎంతసేపు అటెన్షన్‌ పెట్టగలుగుతున్నారనేది ముఖ్యం. క్లాస్‌ చెబుతున్నప్పటికీ వర్చువల్‌గా కమ్యూనికేషన్‌ అంతగా జరగడం లేదు. అందుకే, డిజిటల్‌లో క్లాస్‌ తీసుకునేప్పుడు సదరు వ్యక్తి తక్కువ టైమ్‌ కేటాయించి ఆ ప్రోగ్రామ్‌ డిజైన్‌ చేసుకోవాలి. క్లాస్‌ బోర్‌ ఉండకూడదు. నేర్చుకునేవాళ్లు కూడా వాళ్లకు వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండాలి. రొటీన్‌గా చెబుతూ పోతే ఇటు మాస్టర్‌కి, అటు విద్యార్థికీ ఆసక్తి ఉండదు. 
– అరవింద్‌ జాషువా, ఫ్యాషన్‌ డిజైనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement