కరోనా వైరస్ పుణ్యమా అని ఐటీ కంపెనీలకు మాత్రమే పరిమితం అనుకున్న వర్క్ ఫ్రం హోం ఇప్పుడు అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. దీనికి ఇంటర్నెట్ అన్నది ఆధార భూతమన్నది కాసేపు మరిచిపోయినా.. ఇకపై మన ప్రపంచం భౌతికంగా కాకుండా.. డిజిటల్ రూపంలోనే ఎక్కువగా దర్శనమివ్వనుందనడంలో సందేహం లేదు. రూఫ్‌టాప్ గార్డెన్‌పై మూన్‌లైట్ డిన్నర్లు.. హనీమూన్ కోసమో.. విహార యాత్రకో స్విట్జర్లాండ్‌కు వెళ్లే అవకాశాలు తగ్గుతాయి.
లాక్‌డౌన్ కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు పెరుగుతున్న ఆదరణను గమనిస్తే.. భవిష్యత్తులో సినిమాలు, పబ్‌లు, క్లబ్ పార్టీల ఉనికి కూడా నామమాత్రం కానుందన్న సందేహాలు తప్పవు. బాస్‌ను చూడాలంటే మాత్రం ఆఫీసుకెళ్లే పరిస్థితులు.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బడి పాఠాలు నిత్యకృత్యం కావడం అనివార్యం కానుంది. మార్పు విద్య, వినోద రంగాలకు మాత్రమే పరిమితం కాదు. పరిశ్రమల్లోనూ ఆటోమేషన్, ఏఐ వంటి టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయి. పూర్తిస్థాయి డిజిటల్ ప్రపంచం అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాజంతో, రాజ్యంతో మనిషి సంబంధాలు చాలా మారిపోతాయని లండన్‌లోని కింగ్స్ కాలేజీ స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ క్రెయిగ్ పేర్కొంటున్నారు.
విప్లవాత్మక మార్పులు..
1918–20ల మధ్య వచ్చిన స్పానిష్ ఫ్లూ తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య కరోనానే. ఇప్పటికే సుమారు 35 లక్షల మంది వైరస్ బారిన పడగా.. రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. దీని ప్రభావం మానసికంగా ఇతరులపై కూడా ఎంతో ఉంది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు ఎదురైతే ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆరోగ్య సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. డిజిటల్ టెక్నాలజీలు, టెలి మెడిసిన్‌లు సాధారణమైపోవడం మాత్రమే కాదు.. అత్యవసర పరస్థితుల్లో అవసరాలకు తగ్గట్టుగా ఐసీయూ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభిస్తాయి.
ఇళ్లలోనే చేసుకోదగ్గ పరీక్షలను అభివృద్ధి చేయడం ద్వారా దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలకూ వైద్యుల వద్దకు వెళ్లే పరిస్థితి పోయి.. అప్లికేషన్ల రూపంలో వైద్యుడిని సంప్రదించడం, మందులు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్రజారోగ్య వ్యవస్థలోని లోటుపాట్లను తీరుస్తూ డిజిటల్ ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్తులో చిన్నదైనా సరే.. ఓ సొంత ఇల్లు ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతుందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఫలితంగా అపార్ట్‌మెంట్ల స్థానంలో నగరాలకు దూరంగా చిన్న చిన్న పల్లెల్లాంటి వ్యవస్థలు ఏర్పడతాయని, తద్వారా కరోనా వంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందొచ్చన్న భావన బలపడుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment