
రాజమౌళి ట్రయల్ షూట్ ప్లాన్ చేశారు. ప్రçపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’లాంటి సినిమా తెరకెక్కించిన రాజమౌళికి ట్రయల్ షూట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ ఏ సినిమా కోసం ఈ ట్రయల్ షూట్ అనుకుంటున్నారా? మరేం లేదు... కరోనా ఎక్కడికీ వెళ్లలేదు. మనతోపాటే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ పనులు చేసుకుంటున్నారు. కొన్ని నియమ నిబంధనలు సూచించి, షూటింగ్స్ చేసుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమవారికి అనుమతి ఇచ్చాయి.
తక్కువమంది సభ్యులతో షూటింగ్ చేయాలి, భౌతిక దూరం పాటించాలి.. వంటివన్నీ గైడ్‌లైన్స్‌లో ఉన్నాయి. ఇవి పాటిస్తూ... షూటింగ్స్ ఎలా చేయాలి? అని ఓ నిర్ణయానికి రావడం కోసమే ఈ ట్రయల్ షూట్ అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ట్రయల్ షూట్ జరపనున్నారట. 50 మంది సభ్యులతో డూప్ ఆర్టిస్టులతో ఈ షూట్‌ని ప్లాన్ చేశారని భోగట్టా. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో అజయదేవగన్, ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment