
అమితాబ్ బచ్చన్
అసలు అసలే.. నకిలీ నకిలీయే. అసలు చూసినప్పుడు కలిగిన తృప్తి నకిలీ చూసినప్పుడు ఉంటుందా? అంటున్నారు అమితాబ్ బచ్చన్. ఆయన ‘అసలు’ అని రిఫర్ చేసినది ‘ఫిల్మ్’ గురించి, ‘నకిలీ’ అన్నది ‘డిజిటల్’ గురించి. డిజిటల్ టెక్నాలజీని ఆయన జిరాక్స్‌తో పోల్చుతున్నారు. ‘ఫిల్మ్’తో తీసిన సినిమా ఇచ్చే తృప్తే వేరని, డిజిటల్ ఫార్మాట్‌లో కొంచెం అసంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు.
ఇంతకీ ‘ఫిల్మ్’ గొప్పదనం గురించి అమితాబ్ ఎందుకు చెప్పారంటే.. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ‘క్రిస్టోఫర్ నోలన్’ ఫిల్మ్ గురించి, పాత సినిమాలను ఎలా భద్రపరచాలి? తదితర విషయాలపై ఇండియాలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనడానికి విచ్చేశారు. ముంబైలో జరిగిన ఈ సమావేశాల్లో పలువురు భారతీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్లల్లో అమితాబ్ ఒకరు. మొదట్లో సినిమాలు తీయడానికి ఫిల్మ్ వాడేవారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఫిల్మ్ స్థానంలో డిజిటల్ టెక్నాలజీ వచ్చింది.
ఇప్పుడు 25 టేక్స్ అయినా ఓకే
ఈ మార్పు గురించి అమితాబ్ మాట్లాడుతూ ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ స్టార్స్’ అని అంటుంటాం. అయితే ఇప్పుడే ఫిల్మ్ మాయమైపోయింది. అందుకని ‘ డిజీ యాక్ట్, డిజీ డిజీ’ అని పిలవాలేమో. డిజిటల్ హవా నడుస్తున్నప్పుడు పాత పద్ధతిని వదలకుండా ఫిల్మ్ మీద సినిమా తీస్తున్న క్రిస్టోఫర్ నోలన్‌ని అభినందించాలి. ఫిల్మ్ అనేది ఒరిజినల్. డిజిటల్ దానికి జిరాక్స్ లాంటిది. పికాసో గీసిన బొమ్మలను జిరాక్స్ తీసి, మ్యూజియమ్‌లో పెడితే ఒరిజినల్ చూసిన తృప్తి కలుగుతుందా? ‘కదిలే బొమ్మల’కు దృశ్యరూపం ఇచ్చిన ఫిల్మ్ మరుగునపడిపోయాక థియేటర్‌లో ప్రొజెక్షన్ రూమ్స్‌ని మార్చారు, డిజిటల్ సినిమాని ప్రదర్శించడానికి వీలుగా థియేటర్లను మార్చారు, కెమెరాలు మారిపోయాయి.
చివరికి ‘కదిలే బొమ్మ’లకు దృశ్యరూపం ఇవ్వడానికి చేసిన కృషి, ఆ పరికరాలన్నింటినీ వదిలేశారు. మా అప్పుడు ఫిల్మ్ కెమేరాలు చాలా పెద్దగా ఉండేవి. వాటి ముందు నిలబడగానే మాకు తెలియని భయం, భారం అనిపించేవి. మా వృత్తి మీద మాకు భయభక్తులు కలిగించేది. మేం క్రమశిక్షణగా ఉండేవాళ్లం. ఫిల్మ్ ఎక్కువ స్టాక్ ఉండేది కాదు. అందుకని పొదుపుగా వాడాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఒక్క టేక్‌లో సీన్ ఓకే కాకపోతే 25 టేక్స్ తీసుకోవచ్చు. అప్పుడూ తృప్తిగా అనిపించకపోతే అనిపించేంతవరకూ తీసుకుంటూ ఉండొచ్చు. డైరెక్టర్‌కీ, ఆర్టిస్ట్‌లకూ అంత వెసులుబాటు ఉంటుంది. మా అప్పుడు ‘ఒక్క టేక్’లో చేయాల్సిందే. నా మొదటి సినిమా ‘సాత్ హిందూస్తాన్’ని తక్కువ బడ్జెట్‌తో తీశారు. ముడి సరుకు తక్కువ ఉండేది. ఒక కొత్త ఆర్టిస్ట్‌గా ఒక్క టేక్‌లో సీన్ చేయడం అనేది నాకు పెద్ద సవాల్‌గా అనిపించింది.
నేనెప్పటికీ మరచిపోలేని విషయం ఏంటంటే.. ఆ సినిమా చివరి రోజున నేనొక పెద్ద సీన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అబ్బాస్ (డైరెక్టర్) ‘మన దగ్గర 60 అడుగుల ఫిల్మ్ మాత్రమే మిగిలి ఉంది. ఒకే టేక్‌లో నువ్వు చేసేయాలి. ఎందుకంటే నా దగ్గర ఫిల్మ్ లేదు’ అన్నారు. భయపడుతూ ఆ సవాల్‌ని స్వీకరించాను. ఇప్పుడు అంత ఒత్తిడి లేదు కదా. ఏదైనా అప్పటి రోజులే మంచివి. ఇంకో చాన్స్ లేకపోవడం వల్ల మా దృష్టంతా చేసే సీన్ మీదే ఉండేది. ఎంతో శ్రద్ధగా పని చేసేవాళ్లం. ఇప్పుడు పని చేయడంలేదని కాదు. మా అప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకునేవాళ్లం. అప్పట్లో కెమెరాలో 1000 అడుగుల ఫిల్మ్ ఉండేది. అది అయిపోయాక మళ్లీ లోడ్ చేసేవాళ్లు. ఒక సెకనుకి 24 ఫ్రేములు తిరిగేవి. ఫ్రేమ్స్ అంత ఫాస్ట్‌గా కదులుతుంటే.. ఆ స్పీడ్ మా నటనకు ఓ హద్దు విధించినట్లుగా అనిపించేది. త్వరగా చేసేయాలనే నిర్భంద పరిస్థితి ఆ ఆర్టిస్ట్‌కి ఓ హద్దులానే ఉంటుంది కదా. అదే మాకు నటన, క్రమశిక్షణ, పట్టుదల అన్నీ నేర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment