
ఈ ఏడాది మరింత ప్రగతి
టీసీఎస్ వృద్ధి అవకాశాలపై చైర్మన్ సైరస్ మిస్త్రీ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉండగలదని సంస్థ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి అవకాశాలు భారీగా ఉండగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన కంపెనీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మిస్త్రీ ఈ విషయాలు తెలిపారు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సగటు 8.8 శాతం కన్నా అధికంగా టీసీఎస్ 16 శాతం వృద్ధి సాధించిందని ఆయన వివరించారు. గతంలో ఎదురైన గడ్డు పరిస్థితులను పక్కన పెట్టి ఇటు కంపెనీ, అటు పరిశ్రమ ముందుకు సాగడానికి అవకాశం లభించినట్లేనని మిస్త్రీ తెలిపారు. ఇలాంటి సమస్యలను టీసీఎస్ ఇకపై మరింత సమర్ధంగా ఎదుర్కొనగలదన్నారు. పోటీ కంపెనీలు, పరిశ్రమ సగటు కన్నా అధిక వృద్ధిని సాధించే సంప్రదాయాన్ని కొనసాగించగలమని మిస్త్రీ చెప్పారు.
కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు..
కొత్త టెక్నాలజీలు సహా పలు విభాగాల్లో టీసీఎస్ పెట్టుబడులు పెట్టనున్నట్లు మిస్త్రీ తెలిపారు. ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారిన మొబిలిటీ, బిగ్ డేటా, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి విభాగాలు ఐటీ ముఖచిత్రాన్ని మార్చివేయగలవని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ దేశాల్లో కొంగొత్త డిజిటల్ టెక్నాలజీలపై కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోందని మిస్త్రీ పేర్కొన్నారు. ఇక, మౌలికరంగ సర్వీసులు, ఇంజనీరింగ్ సేవలు, కన్సల్టింగ్ వి భాగాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయన్నారు.
ఇన్వెస్టర్లకు పదేళ్లలో పది రెట్లు రాబడి..
కంపెనీ లిస్టయి పదేళ్లు గడిచాయని, ఈ వ్యవధిలో మదుపుదారులు చేసిన ఇన్వెస్ట్‌మెంట్లపై రాబడులు పది రెట్లు పెరిగాయని మిస్త్రీ చెప్పారు. అలాగే, ప్రతి షేరుపై ఆదాయం 8 రెట్లు పెరిగిందన్నారు.