లెక్కల్లో చూపని సంపదనూ పట్టండి..
► డేటా అనలిటిక్స్ ఉపయోగించండి
► చిన్న వ్యాపారస్తులనూ జీఎస్‌టీ వ్యవస్థలోకి చేర్చండి
► ఐటీ అధికారులకు ప్రధాని మోదీ సూచన
► రెండో ’రాజస్వ జ్ఞాన సంగం’ ప్రారంభం
న్యూఢిల్లీ: డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా .. లెక్కల్లో చూపని సంపదను కూడా వెలికితీయాలని ఆదాయ పన్ను అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే 2022 నాటికి పన్నుల వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చెప్పారు. ’రాజస్వ జ్ఞాన సంగం’ రెండో వార్షిక సదస్సును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అవినీతిని నిర్మూలించి, నిజాయితీగా పన్నులు కట్టేవారిలో విశ్వాసం పెంపొందించేలా పరిస్థితులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని ప్రధాని చెప్పారు.
ఇటీవల అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం కేవలం రెండు నెలల వ్యవధిలోనే కొత్తగా 17 లక్షల వర్తకులను పరోక్ష పన్నుల విధాన వ్యవస్థలోకి తెచ్చిందని ఆయన తెలిపారు. రూ. 20 లక్షల కన్నా తక్కువ వార్షిక టర్నోవరు ఉండే చిన్న వ్యాపారస్తులను సైతం జీఎస్‌టీ విధానంలో నమోదు చేసుకునేలా చూడాలని మోదీ సూచించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. స్వాతంత్య్రానంతరం దేశంలో పన్నులపరంగా ప్రవేశపెట్టిన అతి పెద్ద సంస్కరణ ఫలాలు సామాన్యులకు చేరేలా చూడాలని మోదీ చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారులు పాల్గొంటున్నారు.
పని సంస్కృతి మెరుగుపర్చుకోవాలి..
2022 నాటికి దేశ పన్నుల వ్యవస్థను మరింత మెరుగుపర్చుకునేలా అధికారులు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, పని సంస్కృతిని కూడా మెరుగుపర్చుకోవాలని మోదీ సూచించారు. పన్నుల విభాగానికి లావాదేవీలకు సంబంధించి సిబ్బంది ప్రమేయం చాలా తక్కువ స్థాయిలోనే ఉండాలని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ–అసెస్‌మెంట్ మొదలైన విధానాలు పాటించాలని ప్రధాని చెప్పారు. తద్వారా స్వార్ధ శక్తులు చట్టాలను తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడాన్ని అరికట్టవచ్చన్నారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి..
పన్ను సంబంధ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటుండటంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు ఇరుక్కుపోయిన ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరిస్తే.. ఆ నిధులు పేదల సంక్షేమానికి ఉపయోగపడేవని పేర్కొన్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి రాజస్వ జ్ఞాన సంగం సదస్సులో తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. అలాగే నిజాయితీగా పన్నులు చెల్లించే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ప్రధాని ఆదేశించినట్లు సీబీఈసీ ట్విటర్‌లో వెల్లడించింది.