సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపేందుకు జీఎస్‌టీ రిటన్స్ డేటాను వినియోగించుకోవాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. పన్ను ఎగవేతదారులపై ముప్పేట దాడికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలతో 2018 మే నాటికి పన్ను ఎగవేత దాదాపు అసాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఆదాయాన్ని వారు దాఖలు చేసిన జీఎస్‌టీ రిటన్స్‌తో సరిపోల్చి ఓ డేటాబేస్‌ను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరోక్ష పన్నుల డేటాను ఆదాయ పన్ను రిటన్స్‌తో ప్రభుత్వం సరిపోల్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత పన్ను వ్యవస్థతో పోలిస్తే జీఎస్‌టీ ద్వారా వ్యాపారాల పరిమాణం, లావాదేవీలపై స్పష్టత అధికంగా ఉండటంతో ఆదాయం తక్కువగా చూపడం లేదా ఖర్చులు పెంచి చూపడం వంటి అవకతవకలకు పెద్దగా ఆస్కారం ఉండదని భావిస్తున్నారు.
ప్రజలు పెడుతున్న ఖర్చు, రాబడి, పెట్టుబడులపై డేటా ఎనలిటిక్స్ ద్వారా పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని పన్ను ఎగవేతదారులకు దీంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద పోగుపడిన డిపాజిట్ల డేటా సైతం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండటంతో పన్ను అక్రమాలను పరిశీలించేందుకు డేటా అనలిటిక్స్‌ను విరివిగా ఉపయోగించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment