న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది.
ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్‌బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్‌బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు.
టెక్నాలజీకి ప్రాధాన్యం..
ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్‌బీలు బిగ్ డేటా అనలైటిక్స్‌ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది.
మరింత బలోపేతం
గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్‌ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్‌ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment