
ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్స్ పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకోవాలి
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమ వచ్చే 5–7 ఏళ్లలో ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు (రూ.8.6 లక్షల కోట్లు) పెంచుకునే లక్ష్యంతో పనిచేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2015లో ఎల్రక్టానిక్స్ గూడ్స్ ఎగుమతులు 167వ ర్యాంక్‌లో ఉంటే, అక్కడి నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకున్నట్టు చెప్పారు. జనవరి నెలలో 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ వస్తు ఎగుమతులు నమోదు కావడం గమనార్హం.
ఇదీ చదవండి: యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (ఏఈఈఎంఏ) సమావేశంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పరిశ్రమ అధిక నాణ్యత ఉత్పత్తులను, సేవలను ప్రపంచానికి అందించే విధంగా ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తి విషయంలో భరోసానిచ్చే విధంగా పరిశ్రమ పనిచేయాలన్నారు. సమష్టిగా పనిచేస్తే పోటీతత్వాన్ని పెంచుకోవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగం, కస్టమర్ల ప్రయోజనాల మధ్య సమతూకాన్ని పాటించాలని పరిశ్రమకు సూచించారు.