ముంబై: ప్రపంచం భారత్, భారత పరిశ్రమల వైపు చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎగుమతులను పెంచుకోవాలని సూచించారు. ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్కెటింగ్ విధానాలు, బ్రాండింగ్ ఉత్పత్తులతో దేశంలోని వ్యవస్థాపక సామర్థ్యాలు భారత్ అసలైన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తామయన్నారు. 49వ జెమ్ అండ్ జ్యుయలరీ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘ఈ నెల 24న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మంత్రులతో (ఐస్‌లాండ్, లీచెస్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) సమావేశం ఉంది.
వారు భారత్‌తో వాణిజ్య చర్చలకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలు, రష్యా కూడా భారత్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్నాయి. కనుక దేశ పారిశ్రామికవేత్తలు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి’’అని మంత్రి సూచించారు. ప్రభుత్వం వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు నిజాయితీగా కృషి చేస్తోందంటూ, పరిశ్రమ నైతిక విధానాలు అనుసరించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం యూఎస్, జీ7 దేశాలతో చర్చించడం ద్వారా ఆంక్షలు లేకుండా చూడాలని ఇదే సమావేశంలో భాగంగా జెమ్, జ్యుయలరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా మంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment