
కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో (బీటీఏ) దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆ దిశగా చర్చలు సానుకూల ధోరణిలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంలో తొందరపాటుతనంతో వ్యవహరించడం శ్రేయస్కరం కాదని ఆయన వివరించారు.
ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు బీటీఏపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్ నాటికి ముగియవచ్చని అంచనాలు ఉన్నాయి.
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక బంధాలు మరింత పటిష్టమయ్యేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ వేగవంతమయ్యేందుకు నిర్మాణాత్మకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
భారత్–ఇటలీ సంబంధాలు మరింత బలపడేందుకు ఐఎంఈసీ (భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ కారిడార్) తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగే దిశగా అవరోధాలను తొలగించడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే పక్షంలో 90 రోజుల్లోపే అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.