రూ.43.5 లక్షల కోట్ల పెట్టుబడులు
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమి (ఈఎఫ్‌టీఏ)తో చేసుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)తో భారత్ 400–500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.43.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్‌టీఏ సభ్య దేశాల నుంచి 15 ఏళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నాలుగైదు రెట్లు అధికంగా ఎఫ్‌డీఐ దేశంలోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉండడం గమనార్హం. ఈఎఫ్‌టీఏ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్, పాలిష్డ్ వజ్రాల దిగుమతులను చాలా తక్కువ రేటుపై లేదా సున్నా రేటుపై భారత్ అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా సభ్య దేశాలు ఇచ్చిన హామీలో భాగంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది అంచనా. నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందం ఆమోదం దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయంటూ, ఈ ఏడాది చివరికి ఇవి అమల్లోకి రావచ్చని మంత్రి గోయల్ చెప్పారు.
ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!
పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో కేటాయింపులు
ఎన్‌ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్ పట్టణాల్లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని ఈఎఫ్‌టీఏ సభ్య దేశాలకు ఆఫర్ చేయనున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. లేదా బడ్జెట్‌లో ప్రకటించినట్టు 100 హబ్ అండ్ స్పోక్ పారిశ్రామిక కేంద్రాలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ దిశగా ఆయా దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈఎఫ్‌టీఏ–భారత్ మధ్య 2023–24లో 24 బిలియన్ డాలర్ల (రూ.2.08 లక్షల కోట్లు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో నార్వే ఉంది. 2000–2004 మధ్య స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు 10.72 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment