తుమ్మలూరులో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు
మహేశ్వరంర (రంగారెడ్డి): ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పనులు చేపట్టింది. ఈ ఫైబర్ గ్రిడ్ సేవలను ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం రూ.5వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకా న్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇంటింటికి ఇంటర్నెట్ నినాదం టీ ఫైబర్ గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశం. పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసింది. మహేశ్వరం, మన్సాన్‌పల్లి, తుమ్మలూ రు, సిరిగిరిపురం గ్రామాల్లో టీ ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం లైన్లు వేశారు.
ఒక్కో గ్రామంలో సుమారు రూ.50 లక్షలతో పనులు చేపట్టి పూర్తిచేశారు. టెలిఫోన్, వైఫై, ఈ–హెల్త్ ఈ– ఎడ్యుకేషన్, ఈ– పంచాయతీ, పౌర సేవలు, మినీ థియేటర్స్, వీడియో కాన్ఫరెన్స్‌లు, మీసేవ కేంద్రాల ద్వారా అందే సేవలు, ట్రిపుల్ సర్వీస్‌లు (ఇంటర్నెట్, కేబుల్ నెట్‌వర్క్, ల్యాండ్ లైన్ ఫోన్ సర్వీసులు), గ్రామంలో వీధి దీపాలను ఆటోమెటిక్ పద్ధతిలో వేయడం, ఆర్పడం వంటి సేవలను అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాల్లో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రులు, మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామంలో పది కనెక్షన్లు ఇచ్చారు.ఈ –హెల్త్ ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నారు.
వైద్య సిబ్బంది వ్యక్తుల ఆరోగ్య వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేవలు అందిస్తారు. అదేవిధంగా జనన, మరణ, ధ్రువీకరణ పత్రాలు సహా ఇతర ధ్రువీకరణ పత్రాలు 24 గంటల్లో ఇచ్చేలా మన్సాన్‌పల్లి గ్రామంలో సేవలను విస్తరించారు. రోగులు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో బీపీ, షుగర్ పరీక్షల వివరాలు సేకరిస్తారు. రోగులకు అవసరమయ్యే మందులను లైవ్‌లో చెబుతారు. ప్రజలను సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సులభతరం చేశారు. బటన్ నొక్కితే అధికారులు, ప్రజా ప్రతినిధులకు మెయిల్ వెళ్తుంది. వారు మెయిల్ చూసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు.
ఈ– ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం కోసం మినీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాలలకు డిజిటలైజేషన్ చేసి నాణ్యమైన విద్యను స్మార్ట్ క్లాస్‌ల ద్వారా విద్యార్థులకు అందిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పిస్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, సలహాలు, సూచనలు, పంటల సాగు, తెగుళ్ల నివారణకు మందుల, ఎరువుల వాడకం వివరాలు, నిత్యం రైతు బజార్‌లో కూరగాయాల ధరల వివరాలు అందించనుంది.
వీధి దీపాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి పంచాయతీ కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. స్మార్ట్ వాయిస్, వీడియో కాన్ఫరెన్స్‌లు, వాతవరణం, ఉష్ణోగ్రతల వివరాలు, తాజా వార్తల అప్‌డెట్స్, అసెంబ్లీ సమావేశాలు, జీఓలు పలు అంశాలను తెలుసుకోవచ్చు. ఈ నాలుగు గ్రామాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా టీ ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment