సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది.
ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది.
100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం
ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్‌పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది.
వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్‌ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్‌ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది.
ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్‌నెట్, బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment