పెరిగిన డిజిటలైజేషన్‌తో విస్తరించిన మార్కెట్‌  | Expanded market with increased digitization | Sakshi
Sakshi News home page

పెరిగిన డిజిటలైజేషన్‌తో విస్తరించిన మార్కెట్‌ 

Published Mon, Apr 19 2021 3:26 AM | Last Updated on Mon, Apr 19 2021 3:26 AM

Expanded market with increased digitization - Sakshi

సాక్షి, అమరావతి: ఐటీ ఉద్యోగార్థులకు తీపి కబురు. కరోనా వైరస్‌ వ్యాప్తితో అగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కూడా ఈ ఏడాది దేశంలో ఐటీ ఉద్యోగాల జాతర జరగనుంది. 2021–22లో భారీసంఖ్యలో కొత్త ఉద్యోగుల నియామకానికి దేశంలో ఐటీ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ ఏజెన్సీ ‘లింక్డిన్‌’ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా పరిస్థితులతో దేశంలో డిజిటలైజేషన్‌ మరింతగా పెరగనుండటంతో పెరగనున్న మార్కెట్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే 2020–21 కంటే 2021–22లో 45 శాతం ఎక్కువగా కొత్త ఉద్యోగుల నియామకానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. లింక్డిన్‌ తాజా నివేదికలోని ప్రధాన అంశాలు.. 

రానున్న రెండేళ్ల మార్కెట్‌ను అంచనా వేసి.. 
కరోనా నేపథ్యంలో డిజిటలైజేషన్, ఆన్‌లైన్‌ కార్యకలాపాలు అమాంతంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్, డిజిటలైజేషన్‌ ప్లాట్‌ఫామ్స్‌కు మార్కెట్‌ విస్తరిస్తోంది. ఈ పరిస్థితి నిపుణులైన మానవ వనరులు ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు సానుకూలాంశంగా మారింది. దాంతో రానున్న రెండేళ్లలో మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేసి ఆ మేరకు అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దీంతో దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాలు భారీగా లభించనున్నాయి. 

► 2020–21లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్‌తో ఐటీ కంపెనీలకు మారెŠక్‌ట్‌లో కొత్త అవకాశాలు లభించాయి. దీంతో 2020 నవంబర్‌ నుంచి ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగ నియామకాలను వేగవంతం చేశాయి. ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’విధానంలోనే పనిచేసేందుకు కొత్త ఉద్యోగులను నియమించాయి.  
► ఇక రానున్న ఏడాదిలో దేశంలో డిజిటలైజేషన్‌ మరింతగా పెరగనుంది. దాంతో కొత్త ఉద్యోగాల కల్పన కూడా అదే రీతిలో పెరుగుతుంది. 2020–21 కంటే ఈ 2021–22లో 45 శాతం ఎక్కువగా కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి.  
► ప్రధానమైన నాలుగు ఐటీ కంపెనీలే కొత్తగా లక్షమంది ఉద్యోగుల నియామకానికి సన్నద్ధమవడం విశేషం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో సంస్థలే దాదాపు లక్షమంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి.  
► టీసీఎస్‌ కొత్తగా 40 వేలమంది ఉద్యోగులను నియమించనుంది. ఇన్ఫోసిస్‌ 26 వేలమందిని, హెచ్‌సీఎల్‌ 12 వేలమందిని కొత్తగా తీసుకోవాలని నిర్ణయించాయి. విప్రో దాదాపు 20 వేలమంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. గత ఏడాది విప్రో 9 వేలమందినే నియమించగా ఈసారి ఏకంగా 20 వేలమంది వరకు తీసుకోవాలని భావిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  
► ఇక దేశంలో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా అదే రీతిలో కొత్త ఉద్యోగుల నియామకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరో లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 

యువతకు ఇదే అవకాశం  
ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి డిజిటలైజేషన్‌ విస్తరిస్తోంది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు ఇది అనివార్య పరిస్థితి. దీంతో కొత్త ప్లాట్‌ఫామ్స్‌కు అవకాశాలు పెరిగాయి. ఈ మార్కెట్‌ను దక్కించుకునేందుకు ఐటీ కంపెనీలు ముందస్తుగా సిద్ధమవుతాయి. తద్వారా భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పరిస్థితిని యువత సద్వినియోగంచేసుకోవాలి. అందుకోసం ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి.  
– పీవీజీడీ ప్రసాదరెడ్డి, వీసీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement