
న్యూఢిల్లీ: దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంబీ) డిజిటైజేషన్ ప్రయోజనాలు చేకూర్చడం అగ్రి–టెక్, హెల్త్–టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెట్టనుంది. ఇందుకోసం 250 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 1,873 కోట్లు) ఫండ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. చాలా మటుకు ఆర్థిక వ్యవస్థలకు చిన్న, మధ్య తరహా వ్యాపారాలే దన్నుగా ఉంటాయని, వాటికి ఊతమిచ్చేందుకే అమెజాన్ సంభవ్ (ఎస్‌ఎంభవ్) వెంచర్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈవో ఆండ్రూ జస్సీ వెల్లడించారు.
సరికొత్త వ్యాపారాలను నిర్మించడంలో మరిన్ని ఎస్‌ఎంబీలకు తోడ్పాటు అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సరికొత్త ఐడియాలను, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ ఫండ్‌ను ఉద్దేశించినట్లు అమెజాన్ ఇండియా గ్లోబల్ ఎస్‌వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘ఈ ఫండ్ ప్రధానంగా ఎస్‌ఎంఈ డిజిటైజేషన్, రైతుల ఉత్పాదకతను పెంచగలిగే అగ్రిటెక్ ఆవిష్కరణలు, ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలకు ఉపయోగపడే హెల్త్–టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది‘ అని ఆయన వివరించారు. వెంచర్ ఫండ్ ద్వారా ఎం1ఎక్స్‌చేంజీ అనే స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఇది చిన్న వ్యాపార సంస్థలకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మార్కెట్‌ప్లేస్ ఎక్సే్చంజీ తరహా సేవలు అందిస్తోంది.
2025కి ఆన్‌లైన్‌లోకి 10 లక్షల షాపులు..
లోకల్ షాప్స్ ప్రోగ్రాం కింద 2025 నాటికి పది లక్షల కిరాణా షాపులను ఆన్‌లైన్‌లోకి తేవాలని నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో ఈ ప్రోగ్రాం కింద ఆన్‌లైన్ బాట పట్టిన దుకాణాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు.
సరఫరా వ్యవస్థలో భారత్‌కు ముఖ్య పాత్ర: ఇంద్రానూయి
కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించగలిగే అవకాశాలు ఉన్నాయని పెప్సీకో మాజీ చైర్మన్ ఇంద్రా నూయి అభిప్రాయపడ్డారు. అయితే, కీలక ఉత్పత్తుల సరఫరాలో తన స్థానం గురించి, పోషించాల్సిన పాత్ర గురించి భారత్ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. తయారీకి సంబంధించి తన నియంత్రణలో ఉంచుకోవాల్సిన ఉత్పత్తులను, దేశీయంగా అవసరాల కోసం ఇక్కడే తయారు చేసుకోవాల్సిన కీలక ఉత్పత్తులను గుర్తించాలని సూచించారు. అమెజాన్ సంభవ్ కార్యక్రమం సందర్భంగా నూయి ఈ విషయాలు చెప్పారు.