నగరీకరణలో మనిషి గల్లంతు | Urbanization man reported missing | Sakshi
Sakshi News home page

నగరీకరణలో మనిషి గల్లంతు

Published Thu, Oct 9 2014 11:31 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

నగరీకరణలో మనిషి గల్లంతు - Sakshi

నగరీకరణలో మనిషి గల్లంతు

నగరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. కాకపోతే, నగర జీవితమంటే ఐటీ, డిజిటలైజేషన్, వైఫై, గ్రోత్ కారిడార్‌లు మాత్రమే కాదు. కనీస జీవన ప్రమాణాలకు, స్వచ్ఛమైన తాగు నీరు, గాలి, పరిశుభ్రత, భద్రతలకు హామీని కల్పించాలనే యోచనే లేకుండా శరవేగంగా నగరాలు, మహా నగరాల నిర్మాణం కోసం వెంపర్లాడటం మంచిది కాదనేది సహేతుక విమర్శ. ఈ వెంపర్లాట వల్లనే మానవ సంబంధాలు, సామాజిక విలువల గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో నేరాలు పెచ్చుపెరిగి పోవ డానికి ప్రధాన కారణం మానవ ప్రవర్తనలో వస్తున్న మార్పేనని సామాజికవేత్తలు చెబుతున్నారు. మానవత్వం లోపించిన నగరీకరణే ఇందుకు కారణమంటున్నారు.
 
సమకాలీనం

 
హైదరాబాద్, విజయవాడ, కడప... అవరోహణక్రమంలో మహానగరం, నగరం, పట్టణం. ఒకటి ఎప్పట్నుంచో రాష్ట్ర రాజధాని, మరొకటి ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న రాష్ట్ర రాజధాని, ఇంకొకటి భవిష్యత్తులో రాజధాని స్థాయి నగరం కాగలదిగా ఎదుగుతున్న పట్టణం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ఇవి సగర్వంగా ప్రాతినిధ్యం వహించాయి. ఈ మూడు చోట్ల ఇటీవల చోటు చేసుకున్న నేర ఘటనలు ఆందోళనకరమైనవి. వాటిని నిశితంగా పరిశీలించి, లోతుగా విశ్లేషిస్తే.. నేరం, ఆ నేరం కన్నా తీవ్రత, ఆ తీవ్రత కన్నా దాని ప్రభావం, అన్నింటిని మించి నేరాలు జరిగిన తీరును చూస్తే గగుర్పాటు కలుగుతోంది. పటిష్టమైన మన కుటుంబ వ్యవస్థ పునాదుల్నే ఈ ఘటనలు సవాలు చేస్తున్నాయి. మానవ సంబంధాలు చాలా వేగంగా చెడిపోతున్నాయనే ప్రమాద సంకేతాలను వెలువరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబాల మధ్య సంబంధాల్లో వస్తున్న మార్పులు ఆ కుటుంబాలకే పరిమితంగాక సమాజంలో అశాంతిని, అలజడిని రేకెత్తిస్తున్నాయనే వాస్తవానికి అద్దం పడుతున్నాయి. నేరాలు జరిగాక కేసు నమోదు, నేరస్తుల గుర్తింపు, దర్యాప్తు, న్యాయవిచారణ, శిక్షలు... ఇదంతా మామూలే! కానీ, నేర నేపథ్యాన్ని, అందులో ఇమిడిన సామాజికాంశాల్ని, ప్రభావిత కారకాల్ని లోతుగా పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు తెరపైకొస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతూ, పట్టణీకరణ, నగరీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఇటీవలి నేరాల్ని సామాజిక దృష్టికోణం నుండి విశ్లేషించుకోవాలి. పాలకుల గాలివాటం విధానాలతో తీరూ-తెన్నూ లేకుండా సాగుతున్న నగరీకరణ పదఘట్టనలకు నిర్దాక్షిణ్యంగా నలిగిపోతున్న సున్నితాంశాలెన్నో! ‘‘నగరాలు అందరి కోసం’’అనే నినాదంతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ ‘మెట్రో పొలిస్‌‘ సదస్సు జరుగుతున్న తరుణంలో ఇవి తప్పక చర్చకు రావాల్సిందే!
 
నేరాల తీరే ఘోరం!

 ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లల్ని హతమార్చి, ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ ప్రొఫెసర్ నిర్వాకం నిర్ఘాంతపరచింది. మంచి అకడమీషియన్‌గా పేరున్న ఆయన ఇలా చేశాడంటే ఎవరూ నమ్మట్లేదు! భార్యాభర్తల తప్పొప్పుల పట్టిక తయారు చేసే ముందు అందుకు దారి తీసిన పరిస్థితుల్ని చర్చించాలి. ఇటువంటిదే ఎప్పుడో జరిగి, ఇటీవలే వెలుగుచూసిన కడప దుర్ఘటన. ఇందులో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలూ హతమయ్యారు. ఆ ఘటన హతురాలి తల్లి నిరంతర పోరాటం వల్లనే నిజం వెలుగు చూసింది. ముఖ్యంగా భర్త అనుమానపు వైఖరే భార్య హత్యకు, పిల్లల ఊచకోతకు, అతని ఆత్మహత్యకు కారణమని దర్యాప్తు కథనం. ఆ శవాలతో పాటు కొన్ని డాక్యుమెంట్లను పూడ్చిపెట్టడాన్ని చూస్తే ఆ భర్తది ఆత్మహత్యా? హత్యా? అన్న అనుమానాలూ రేగుతున్నాయి. విజయవాడ సమీపంలో ఇటీవల ముగ్గురు హతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంటాడి, కాల్పులు జరిపి ముగ్గుర్నీ హతమార్చిన ఘటన కౌబాయ్ సినిమాను తలపింప చేసింది. మహానగరాల్లో, విదేశాల్లో సంపన్నులకు ‘జాతకాలు’ చెప్పే రెండు కుటుంబాల మధ్య స్పర్థ, ఆధిపత్య పోరు వారి జాతకాల్నే మార్చేసింది. ఈ సీరియల్ హత్యల పరంపరలో మొదట దెబ్బతిన్న వర్గం, అమెరికాలో ఉన్న వారి సహకారంతో ఢిల్లీ కిరాయి హంతకులతో కోటి రూపాయల డీల్ కుదుర్చుకొని ప్రత్యర్థుల్ని హతమార్చిన తీరు ఆశ్చర్యకరం. ఈ మూడు ఘటనల్లోనూ కొన్ని మౌలిక సామాజికాంశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కనీస మానవ విలువల పతనం, స్వార్థం, ఆధిపత్యం, అసహనం, పిచ్చి తెగింపు, ప్రాణాలంటే లెక్కలేనితనం... తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సమకాలీన సమాజంలోని ఈ సామాజిక రుగ్మతలను ఎప్పటికప్పుడు గుర్తించి, నియంత్రించే వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. దీంతో ఎవరికి తోచినట్టు వారు నిర్వచిస్తున్న ‘అభివృద్ధి’ ధృతరాష్ట్ర కౌగిలిలో మానవ సంబంధాలు నలిగిపోక తప్పడంలేదు. గమ్యం ఎరుగని ఈ నాగరికత పరుగులో అసలు మనిషే కనుమరుగైపోతున్నాడు.
 
నగరీకరణ దుష్ఫలితాలెన్నో!


స్మార్ట్ సిటీల గురించి పెద్ద ఎత్తున మాట్లాడే వారు ముందు అదేంటో నిర్వచించాలి. అప్పుడే మంచి చెడులు బేరీజు వేసి చూసే అవకాశం ఉంటుంది. ఇలా విమర్శనాత్మకంగా మాట్లాడటం కొందరికి రుచించదు. దాదాపు నలబై శాతం జనాభా కేంద్రీకృతమౌతున్న నగరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. కాకపోతే, నగర జీవితమంటే ఐటీ, డిజిటలైజేషన్, వైఫై, గ్రోత్ కారిడార్‌లు వగైరా మాత్రమే కాదు. మనిషి జీవన ప్రమాణాలు, కనీసావసరాలైన స్వచ్ఛమైన తాగు నీరు, గాలి, పరిశుభ్రత, భద్రతల గురించిన ఆలోచనే లేకుండా అతి వేగంగా భారీ నగరాలు, మహానగరాల నిర్మాణం కోసం వెంపర్లాడటం మంచిది కాదన్న విమర్శ సహేతుకం. ఈ వెంపర్లాట వల్లనే మానవ సంబంధాలు, సామాజిక విలువల గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో నేరాలు పెచ్చుపెరిగిపోవ డానికి మానవ ప్రవర్తనలో వస్తున్న మార్పే ప్రధాన కారణమని సామాజికవేత్తలు చెబుతున్నారు. మానవత్వరహితమైన నగరీకరణే ఇందుకు కారణమంటున్నారు. అర్థం, పర్థం లేకుండా విస్తరిస్తున్న మన నగరాలు జీవనయోగ్యమైనవి కావని ప్రమాణాలను నిర్ధారించే సంస్థలు చెబుతున్నాయి. వాహనం నంబర్, సెల్‌ఫోన్ నంబర్, ఎల్పీజీ నంబర్, ఆధార్ నంబర్.... ఇలా చివరకు మనుషులకు కూడా ఓ ప్రత్యేక నంబరిచ్చేస్తారు. అప్పుడిక సంఖ్యలుగా తప్ప మనుషులకు గుర్తింపుండదు. స్థూలంగా అందరి సంఖ్యగా మాత్రమే మనుషులు మిగిలిపోతారు. ఓట్ల రాజకీయాల పుణ్యమా అని ఈ పరిస్థితి ఇప్పటికే వచ్చింది. మున్ముందు అది మరింత అమానవీయం కానుంది. మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి. ఎదురింట్లో ఏం జరుగుతుందో, పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా ఇరుగు పొరుగులకు పట్టదు. మన నగరాల్లో ‘సామాజికమైన పట్టింపు లేనితనం’ (టౌఛిజ్చీ ఠఛిౌఛ్ఛిట్ఛటట) పెరిగిపోతోంది. ఇదివరకిలా ఉండేది కాదు. గ్రామాల్లోలా కాకపోయినా, పట్టణాలు, నగరాల్లోనూ మనిషికి మనిషికి మధ్య, మానవ సమూహాలకు మధ్య సత్సంబంధాలుండేవి. మంచి- చెడు చర్చకు వచ్చేది. ఎంతోకొంత ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేవారు. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో (క్రీ.పూ.4వ శతాబ్ది) సైతం నగరీకరణ అడ్డదిడ్డంగా కాకుండా ఓ పద్ధతి ప్రకారం జరగాలంటూ కొన్ని నియమాలను సూచించారు. ‘‘మనిషి జ్ఞాపకశక్తికి ఉన్న పరిమితిని బట్టి 5,040 మందికి మించి గుర్తుపెట్టుకోలేం, మన ఊళ్లో, నగరంలో ఉంటున్న వాళ్లంతా మనకు తెలిసినవారై ఉండాలి’’ అంటూ నగర జనాభా 5,040 కి మించకూడదని ఆయన చెప్పాడు. నగరాల్లో జీవన ప్రమాణాలు పెంచడం, మానవ సంబంధాల్ని పరిరక్షించడం, ‘నైబర్‌వుడ్ పాఠశాల,’ ‘నైబర్‌వుడ్ డాక్టర్’ నమూనాలను విస్తరింపజేయడానికి ప్లేటో ఆలోచన స్ఫూర్తి కావాలనేదే సగటు మనిషి వాంఛ.

కుటుంబం కుదేలయింది!

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇపుడు ఇల్లే చిన్నాభిన్నమైంది. భారతీయ సామాజిక వ్యవస్థకు మూలస్తంభమైన ఉమ్మడి కుటుంబం నేడు దాదాపుగా చెదిరిపోయింది. చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనిషికి మనిషి తోడుండే వారు. ఎంతో భరోసా ఉండేది. కుటుంబ సభ్యుల మధ్యే కాక కుటుంబాల మధ్యా సామరస్యం వెల్లివిరిసేది. ఆర్థిక సమస్యలేకాదు, ఏ ఆపద ఎదురైనాగానీ జీవనం నేటిలా ఇన్ని ఒత్తిళ్ల మధ్య సాగేది కాదు. అనునయింపులు, ఓదార్పులు నోటి మాటలుగానే గాక, గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చగలిగేవి. తద్విరుద్ధంగా నేటి జీవనం యాంత్రికమై పోయింది. అవకాశాలు తగ్గి, అవసరాలు పెరగడంతో అత్యధికుల్లో స్వార్థం పెచ్చుపెరిగింది. జనానికి ఎవరి మీదా విశ్వాసం లేకుండా పోతోంది. పరస్పర అనుమానాలు బలపడి, సహనం నశించి, అహాల అంతరాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు, ఆవేశకావేశాలకు ఇవన్నీ కారణమౌతున్నాయి. నడుమ పిల్లలు నలుగుతున్నారు. దైవ భక్తిలో సైతం పాపభీతే తప్ప స్వచ్ఛమైన ఆధ్యాత్మికత కనబడకుండా పోతోంది. నగరాలను మెరుగుపరచాలని, జీవనయోగ్యం చేయాలని భావించేవారు ఈ మౌలికాంశాలపై దృష్టిని పెట్టాలి. జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మానవ సంబంధాల, విలువల పునరుద్ధరణకు ఏం చేయగలమో శాస్త్రీయంగా ఆలోచించాలి. శాస్త్ర సాంకేతికత జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచే ఉపకరణమే తప్ప, జీవన లక్ష్యం కారాదు. శాస్త్ర ప్రగతితో ప్రపంచమే ఓ కుగ్రామమైందంటూ గ్లోబలీకరణ గురిం చి గొప్పలు చెప్పుకోవడం గాక, వేల ఏండ్ల క్రితమే మన పూర్వీకులు ప్రవచిం చిన ‘‘వసుధైక కుటుంబం’’ భావనలోని స్ఫూర్తిని పరివ్యాప్తం చేయాలి.    
 
 దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement