Huge Investments In Country After Covid With Digitization - Sakshi
Sakshi News home page

ఇండియా అవుతోంది‘డిజిటల్‌’

Published Thu, Feb 2 2023 4:05 AM | Last Updated on Thu, Feb 2 2023 9:15 AM

Huge investments in country After covid with digitization - Sakshi

సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్‌ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్‌ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతా­యన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్‌ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది.

వివిధ రంగాల్లో డిజటలైజేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్‌లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటలిస్టులు రూ.3.53  లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్‌ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్‌ మీడియా, డిజిటల్‌ అడ్వర్టైజింగ్, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్‌ డేటా, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్‌ జరుగుతుందని పేర్కొంది. 

స్వయం ఉపాధి 
కోవిడ్‌ లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్‌ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్‌ దెబ్బతో 2021 జూన్‌ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్‌ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్‌’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది.

ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్‌ వంటి ట్రావెల్‌ సంస్థల్లో గిగ్‌ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది.

వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్‌ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభు­త్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్‌ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూ­చి­ంచింది.  ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్‌ అని ఆ నివేదిక పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement