మా దేశంలో అపార విద్య, ఉద్యోగావకాశాలు
పోస్ట్ స్టడీ వర్క్‌లో ఇండియన్స్‌కు అదనపు చాన్స్
ఆ్రస్టేలియా వర్సిటీల్లో అత్యుత్తమ విద్య ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కోర్సులకు ప్రాధాన్యం
ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ కమిషనర్ విక్ సింగ్
సాక్షి, హైదరాబాద్: ఖలిస్తానీ వేర్పాటువాదుల కారణంగా ఇటీవల కెనడాతో భారత్ సంబంధాలు దెబ్బతినటంతో ఆ దేశానికి ఉద్యోగాల కోసం, ఉన్నత విద్యకోసం వెళ్లాలని భావించిన భారతీయులు పునరాలోచనలో పడ్డారు. కెనడాలో ఉద్యోగావకాశాలు కూడా తగ్గిపోవటంతో మరో సురక్షితమైన, అపార అవకాశాలు ఉన్న దేశం కోసం చూస్తున్నారు. అలాంటివారికి ఇప్పుడు ఆస్ట్రేలియా అవకాశాల గనిలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ కమిషనర్ విక్ సింగ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా’లో పాల్గొనేందుకు వచ్చిన సింగ్.. ఆ్రస్టేలియాలో ఇక్కడి విద్యార్థులకు ఉన్న అవకాశాల గురించి ‘సాక్షి’కి వివరించారు.
పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వీలు..
కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా వీసా జారీ చేస్తున్నామని విక్ సింగ్ చెప్పారు. వేరే దేశాలవారికి రెండున్నరేళ్ల పాటు పనిచేసుకునే వీలు కల్పిస్తుండగా, భారతీయ విద్యార్థులకు అదనంగా మరో ఏడాది పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు.
ఇరు దేశాల మధ్య ఎక్టా ద్వైపాక్షిక ఒప్పందం నేపథ్యంలో ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు. చదువుకునే సమయంలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని గుర్తుచేశారు. పర్యాటకులకు కూడా అద్భుతమైన అనుభూతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ఎన్నెన్నో అవకాశాలు..
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు తమ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించేందుకు సానుకూలంగా ఉందని విక్ సింగ్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ‘సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, బిజినెస్, హెల్త్ రంగాలతోపాటు క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వినూత్న కోర్సులు చదివేందుకు భారతీయ విద్యార్థులు ఆ్రస్టేలియాకు వస్తుంటారు.
మా దేశంలోని 43 యూనివర్సిటీల్లో దాదాపు సగం వరకు వరల్డ్ టాప్ 200 జాబితాలో ఉన్నాయి. టాప్ 100 జాబితాలో 9, టాప్ 20 జాబితాలో మూడు ఆస్ట్రేలియా వర్సిటీలు ఉన్నాయి. నవకల్పనల్లో (ఇన్నోవేషన్) ఆస్ట్రేలియా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మనమంతా వాడుతున్న వైఫైని ఆస్ట్రేలియాలోనే కనిపెట్టారు.
ఆస్ట్రేలియా వర్సిటీల్లో చదివిన విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మా దేశంలో స్కూల్ స్థాయి నుంచే ఏఐని వినియోగిస్తున్నాం’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment