సాక్షి, విశాఖపట్నం: భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడ్రనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు వివరించారు.
దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్‌ను ఆవిష్కరించారు. అజయ్ టిర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల భూ రికార్డులను నవీకరించాలని, రాజ్యాంగంలో గుర్తించిన అన్ని భాషల్లోకి అనువదించాలని సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు అర్హత కలిగిన కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు భూమి సమ్మాన్ ప్లాటినం సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శించిన ప్రజంటేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపడుతున్న రీ సర్వే వల్ల భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని టిర్కీ పేర్కొన్నారు. రీ సర్వే, ల్యాండ్ రికార్డుల నవీకరణ, మోడరన్ రికార్డు రూముల నిర్వహణ, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించారు. సోన్మోని బోరా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రాజెక్టుల్లో భాగంగా భూ సంవాద్–6 ప్రాజెక్టు విజయవంతమయ్యేలా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న భూ సంబంధిత విధానాల గురించి ఏపీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతా«దికారులు, ఎన్‌ఐసీ, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment