Asian Athletics Championships 2023: Jyothi Yarraji, Aboobacker Win Gold For India - Sakshi
Sakshi News home page

జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి

Published Fri, Jul 14 2023 4:09 AM | Last Updated on Fri, Jul 14 2023 10:16 AM

Jyothi Yarraji, Aboobacker win gold - Sakshi

ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని  ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ  సాధించింది. ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది.

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది.

విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్‌ అథ్లెటిక్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్‌ జేమ్స్‌ హీలియర్‌ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్‌లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది.  

ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్‌ కుమార్‌ సరోజ్‌... పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్‌ పసిడి పతకాలు నెగ్గారు.    
 

బ్యాంకాక్‌: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్‌లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది.

అసుక తెరెదా (జపాన్‌; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్‌; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్‌ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్‌ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ట్రాక్‌ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్, రిలయెన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా      అంబానీ అభినందనలు తెలిపారు.  



పురుషుల 1500 మీటర్ల ఫైనల్‌ రేసును అజయ్‌ కుమార్‌ సరోజ్‌ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్‌కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు.  

♦ పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో కేరళ అథ్లెట్‌ అబ్దుల్లా అబూబాకర్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం నెగ్గిన అబూబాకర్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు.  

♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్‌ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. 

కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్‌ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఆసియా చాంపియన్‌షిప్‌లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా.

ఐదో హర్డిల్‌లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్‌ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్‌ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్‌ అథ్లెట్స్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా.

పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్‌లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది.

–జ్యోతి యర్రాజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement