భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది.
మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment