న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్‌లో ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు ఇన్వెస్టర్లను ఓమాదిరిగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కొత్తగా 51 లక్షల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. దీంతో 43 ఫండ్ హౌస్‌ల ద్వారా మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 13.46 కోట్లకు చేరాయి. ఇటీవల మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)పట్ల అవగాహన పెరగడం, లావాదేవీలలో డిజిటైజేషన్ వంటి అంశాలు ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు.
గత 12 నెలల్లో స్పీడ్
ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) గణాంకాల ప్రకారం గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 93 లక్షల ఖాతాలు ప్రారంభంకాగా.. గత 12 నెలల్లో 3.2 కోట్ల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. అయితే భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, బలపడుతున్న బాండ్ల ఈల్డ్స్, యూఎస్ ఫెడ్ కఠిన విధానాలు వంటి అంశాలు క్యూ1లో పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఎల్‌ఎక్స్‌ఎంఈ నిపుణులు ప్రియా అగర్వాల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఇకపై పెట్టుబడులు ఊపందుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఈక్విటీలకే ప్రాధాన్యం
ఎంఎఫ్‌లలో రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా ఈక్విటీ ఫండ్స్‌కే ఆసక్తి చూపుతారని మైవెల్త్‌గ్రోత్.కామ్ సహవ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. దీంతో మార్కెట్ పరిస్థితులు ఫోలియోలపై ప్రభావం చూపుతాయని తెలియజేశారు. రానున్న కాలంలో మార్కెట్లు స్థిరపడితే ఫండ్స్‌లో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా వేశారు. ఎంఎఫ్ పరిశ్రమలో 10 కోట్ల ఫోలియోలు 2021 మే నెలకల్లా నమోదయ్యాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. క్యూ1లో జత కలిసిన 51 లక్షల ఖాతాలలో 35 లక్షల ఫోలియోలు ఈక్విటీ ఆధారిత పథకాలేకావడం గమనార్హం!
ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఖాతాలు ఓకే
Published Mon, Jul 11 2022 4:38 AM | Last Updated on Mon, Jul 11 2022 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment