రుణానికి సంబంధించి అన్ని వివరాలు
అన్ని రకాల చార్జీల సమాచారం
రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలకు కేఎఫ్‌ఎస్ తప్పనిసరి
బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తప్పకుండా ఇవ్వాల్సిందే
ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ ఆదేశాలు
ఎన్నో అవసరాలకు రుణాలు తీసుకోవడం నేడు సర్వ సాధారణంగా మారింది. డిజిటైజేషన్ కారణంగా కోరుకున్నంత రుణం నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాకు జమ అవుతోంది.
అవసరంలో ఉన్న వారు రుణం వస్తే చాలన్నట్టు, మిగిలిన ముఖ్యమైన విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనివల్ల తర్వాతి కాలంలో పడే భారాన్ని చూసి ఆందోళన చెందే పరిస్థితి. షరతులు, నియమ, నిబంధనలు, ఫీజుల గురించి తెలుసుకోకుండానే రుణ ఒప్పందంపై నిస్సంకోచంగా సంతకాలు చేయకూడదు.
రుణానికి సంబంధించి కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ (కేఎఫ్‌ఎస్/ముఖ్య విషయాల సమాహారం)ను తప్పకుండా చదవాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో అంగీకారానికి రావాలి. కేఎఫ్‌ఎస్‌ను రుణ గ్రహీతలకు తప్పకుండా అందజేయాలంటూ ఆర్‌బీఐ తన నియంత్రణ పరిధిలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక విధంగా రుణ గ్రహీతకు రుణంపై కళ్లు తెరిపించేదే కేఎఫ్‌ఎస్.
కేఎఫ్‌ఎస్‌తో రుణ గ్రహీత నిర్ణయం సులభంగా మారుతుంది. ఒక బ్యాంక్ ఇస్తున్న రుణ ఆఫర్‌తో పోలిస్తే మరో బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆఫర్‌లో ఏది మెరుగైనదో తేల్చుకోవచ్చు. కేఎఫ్‌ఎస్ అందించకపోయినా, ఒకవేళ కేఎఫ్‌ఎస్‌లో వైరుధ్యాలు ఉన్నా వాటిని రుణదాత దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదును 30 రోజుల్లో పరిష్కరించకపోతే, పరిష్కారం సహేతుకంగా లేకపోతే ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించొచ్చు. ఒకవేళ డిజిటల్ రుణం అయితే దానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ కాలంలో రుణ గ్రహీత తనకు మంజూరైన రుణాన్ని వెనక్కి తిప్పికొట్టొచ్చు. దీనికి ఎలాంటి పెనాలీ్టలు పడవని గార్గ్ వివరించారు.
కేఎఫ్‌ఎస్ అంటే..?
2023 నవంబర్ 15న ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన ‘ఈకామ్’, ‘ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్’ రుణ ఉత్పత్తులను తక్షణం నిలిపివేయాలని కోరింది. కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ (కేఎఫ్‌ఎస్)ను రుణ గ్రహీతలకు బజాజ్ ఫైనాన్స్ అందించకపోవడంతో ఆర్‌బీఐ ఈ చర్యలకు దిగింది. కేఎఫ్‌ఎస్ అన్నది ఒక డాక్యుమెంట్ (పత్రం). ఇందులో రుణానికి సంబంధించి కీలక సమాచారం అంతా ఉంటుంది.
నిజానికి రుణ ఒప్పందంలో (లోన్ అగ్రిమెంట్) అన్ని వివరాలు ఉన్నప్పటికీ, అందులోని పదజాలం అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. కీలక వివరాలన్నింటినీ సులభంగా అర్థమయ్యేలా కేఎఫ్‌ఎస్ చెబుతుంది. అందుకే దీన్ని కీలక సమాచార పత్రంగా చెబుతారు. రుణంపై వడ్డీ రేటు ఎంత, షరతులు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, నిర్ణీత కాలం కంటే ముందే సంబంధింత రుణాన్ని తీర్చివేస్తే విధించే చార్జీలు, రుణ వాయిదా చెల్లింపుల్లో ఆలస్యం అయితే పడే పెనాల్టీ చార్జీలు.. ఇలా రుణానికి సంబంధించి సమగ్ర వివరాలు అందులో వెల్లడించడం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బాధ్యత. సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందులో తెలియజేయాలి.
కేఎఫ్‌ఎస్ పారదర్శకతను తీసుకొస్తుంది. కీలక వివరాలన్నీ ఉండడంతో, రుణ గ్రహీత అన్నీ తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందుకే దీన్ని రుణదాతలు అందరికీ అందించాలంటూ ఆర్‌బీఐ ఆదేశాలు తీసుకొచ్చింది. ‘‘కేఎఫ్‌ఎస్ అంటే రుణానికి సంబంధించి అస్థిపంజరం వంటిది. రుణం తీసుకునే వ్యక్తి అన్ని కీళ్లను తెలుసుకోవాలి, వంపులు, కదలికలను తెలుసుకోవాలి’’అని సింఘానియా అండ్ కో పార్ట్‌నర్ రాజీవ్ శర్మ వివరించారు. డిజిటల్ రుణాలకు సంబంధించి కేఎఫ్‌ఎస్ మరింత కీలకం. ఎందుకంటే రుణ ప్రక్రియలో ఒకటికి మించిన పారీ్టలు భాగస్వాములై ఉంటాయి.
ఏమి చూడాలి..?
రుణ కాల వ్యవధి, రుణానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన మొత్తం (ఈఎంఐ) గురించి కేఎఫ్‌ఎస్‌లో స్పష్టంగా ఉంటుంది. రుణానికి అనుబంధంగా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ కోరుతోందా? అన్నది కేఎఫ్‌ఎస్‌లో పరిశీలించుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. ముఖ్యంగా రుణానికి సంబంధించి చెబుతున్న వడ్డీ రేటు వార్షికమేనా? అన్నది చూడాలి. రుణం చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలు గురించి, అన్ని రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. రుణ గ్రహీత కోరితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కేఎఫ్‌ఎస్ కాపీ, రుణ డాక్యుమెంట్లను ఈమెయిల్‌కు పంపిస్తాయని పరిజిత్ గార్గ్ చెబుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రుణం తీసుకుంటున్నట్టు అయితే, రుణ వివరాల పేజీ నుంచే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని శర్మ సూచించారు. నెట్‌బ్యాంకింగ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆదిల్ శెట్టి తెలిపారు.
పారదర్శకత కోసం..
‘‘చారిత్రకంగా చూస్తే రుణ వ్యయాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. వడ్డీ రేటునే ప్రముఖంగా ప్రకటనల్లో పేర్కొనడం కనిపించేది. తక్కువ వడ్డీ రేటుకు వస్తుందని రుణం తీసుకున్న తర్వాతే.. వివిధ రకాల ఫీజుల భారం తెలిసొచ్చేది. పారదర్శకత లేకపోవడం వల్ల వారు వివిధ రుణ ఉత్పత్తులను పోల్చుకుని, వాస్తవ రుణ వ్యయాల గురించి అర్థం చేసుకోలేకపోయేవారు’’అని మై మనీమంత్ర ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు.
అన్ని రకాల చార్జీల గురించి కేఎఫ్‌ఎస్‌లో పేర్కొనడం పారదర్శకత, వినియోగదారు అనుకూల రుణ వాతావరణానికి దారితీస్తుందన్నారు. ‘‘ఇప్పటికైతే రుణాలపై వడ్డీ రేటు, ఇతర ఫీజులు, చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు తదితరమైనవి ఉండేవి. కేఎఫ్‌ఎస్‌ను అన్ని రకాల రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలకు విస్తరించాం. రుణాల పంపిణీలో పారదర్శకత పెంపు, కస్టమర్లు తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుంది’’అని ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు.
వడ్డీ రేటు వేరు, ఏపీఆర్ వేరు
ఈ రెండింటి మధ్య ఉన్న బేధాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకోవాలి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్) అంటే అన్ని చార్జీలు కలిపినది. ఉదాహరణకు రూ.లక్ష రుణాన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి 36 నెలల కాలానికి 18 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అంటే నెలవారీ ఈఎంఐ రూ.1,500 అనుకుంటాం. కానీ కాదు. ఈ రుణం ఏపీఆర్ 20.16 శాతం అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.1,680 అవుతుంది.
ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, ఆరంభంలో విధించే పలు చార్జీలు అన్నీ కలసి ఈ స్థాయికి చేరింది. రుణంపై నికర వడ్డీ రేటుకు అన్ని రకాల చార్జీలు కలిపి ఏపీఆర్ ఎంత అన్నది కేఎఫ్‌ఎస్‌లో పేర్కొనాలన్నది ఆర్‌బీఐ ఆదేశం. అయితే, రుణ వాయిదా ఆలస్యంగా చెల్లిస్తే విధించే ఆలస్యపు రుసుము, కంటింజెంట్ చార్జీలు ఇందులో భాగంగా ఉండవని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి తెలిపారు. ఈఎంఐ బౌన్స్ చార్జీలు, రుణాన్ని ముందస్తుగా చెల్లించేట్టు అయితే విధించే చార్జీలు కూడా ఏపీఆర్‌లో కలసి ఉండవు.
ఇవి తెలుసుకున్న తర్వాతే..
► చెల్లింపుల సామర్థ్యం: ఎంత రుణం కావాలన్న స్పష్టత ఒక్కటీ ఉంటే సరిపోదు. తీసుకునే ఆ రుణానికి నెలవారీ ఎంత మేర చెల్లించగలరు? అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. దీని ఆధారంగానే కాల వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తక్కువ కాలవ్యవధిని ఎంపిక చేసుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం ఎంపిక చేసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. బ్యాంకుల మధ్య వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తదితర చార్జీలను పోల్చుకున్న తర్వాతే ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 0.5% వ్యత్యాసమున్నా 4–5 ఏళ్ల చెల్లింపుల్లో చెప్పుకోతగ్గంత తేడా వస్తుంది. తమ ఆదా యంలో అన్ని రుణాలకు చేసే చెల్లింపులు 40% మించకుండా చూసుకోవాలి.
► ఆదాయంలో అప్పుల రేషియో:
బ్యాంక్‌లు రుణం ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, ఆదాయంలో అప్పుల రేషియోని చూస్తాయి. ఆదాయంలో అప్పులకు చేసే చెల్లింపులు 43 శాతం మించి ఉంటే అప్పుడు చెల్లింపుల్లో రిస్క్ ఉన్నట్టు అవి భావించొచ్చు. దాంతో రుణ దరఖాస్తు తిరస్కరణ లేదంటే అధిక వడ్డీ రేటును విధించొచ్చు.
► క్రెడిట్ స్కోర్:
750 అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే దాన్ని ఉత్తమమైనదిగా పరిగణిస్తాయి బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు. అంతేకాదు రుణం సులభంగా, వేగంగా లభిస్తుంది. డిమాండ్ చేసి వడ్డీ రేటులో కొంత తగ్గింపు ప్రయోజనాన్ని సైతం పొందొచ్చు.
► ముందస్తు చెల్లింపులు:
రుణాన్ని నిర్ణీత కాలానికి ముందే లేదంటే నెలవారీ వీలున్నప్పుడల్లా అదనపు చెల్లింపులు చేసుకుంటూ వెళితే త్వరగా తీరిపోతుంది. దీనివల్ల వడ్డీ రూపంలో చెప్పుకోతగ్గంత ఆదా చేసుకోవచ్చు. కాకపోతే చాలా సంస్థలు మందుస్తు రుణ చెల్లింపులపై 2–4 శాతం చార్జీ విధిస్తుంటాయి. ఈ తరహా చార్జీ అమలు చేయని సంస్థ నుంచి తీసుకోవడం అనుకూలం.
మెరుగైన అవగాహన
‘‘కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇదొక అవకాశం. రుణానికి సంబంధించి అన్ని ముఖ్యమైన వివరాలను తెలియజేయడం వల్ల రుణగ్రహీత అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఎంఎస్‌ఎంఈ రుణ గ్రహీతలు మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది’ ’అని గోద్రేజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, డిజిటల్ రుణాలకే లోగడ కేఎఫ్‌ఎస్ తప్పనిసరి. ఇకపై అన్ని రిటైల్ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలకు ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘రుణాలపై అసలు వ్యయాలు ఎంత మేర ఉన్నాయనేది రుణ గ్రహీతలకు దీనివల్ల తెలుస్తుంది. చెప్పకుండా విధించే చార్జీలకు కళ్లెం వేస్తుంది.
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం రుణ గ్రహీతల్లో రుణ ఎకోసిస్టమ్ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది.’’అని ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ ‘వెలాసిటీ’ వ్యవస్థాపకుడు, సీఈవో అభిరూప్ మేధేకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేఎఫ్‌ఎస్ రిటైల్ రుణ గ్రహీతలకు మేలు చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకు కేఎఫ్‌ఎస్‌తో ప్రత్యేకంగా అవసరం ఉండదు. ఎందుకంటే ఆయా సంస్థల వద్ద ఆర్థిక, న్యాయ నిపుణులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కనుక బ్యాంకుల ఒప్పంద పత్రాలను అవి సమగ్రంగా సమీక్షించుకోగలవు. కానీ, చిన్న సంస్థలు, వ్యక్తులకు ఇది కష్టమైన పనే అవుతుంది. వ్యక్తులు అయితే బ్యాంక్ మార్కెటింగ్ సిబ్బంది చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కేఎఫ్‌ఎస్‌ను వ్యక్తులు, ఎంఎఎస్‌ఎంఈ రుణాలకు ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment