
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్దాల కిందటి పదో తరగతి రికార్డులను కంప్యూటరీకరించేందుకు కసరత్తు మొదలైంది. 2004 నుంచి పదో తరగతి చదివిన విద్యార్థుల రికా ర్డుల కంప్యూటరీకరణ జరిగినా అంతకుముందు పదో తర గతి చదివిన వారి రికార్డుల ప్రక్రియ జరగలేదు. తాజాగా వాటిని కూడా కంప్యూటరీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. తద్వారా గత 61 ఏళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల వివరాలను సురక్షితంగా భద్రపరిచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఏర్పాట్లు చేస్తోంది.
2004 నుంచి ఏటా సగటున 9.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైతే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 1958 నుంచి 2004 వరకు 46 ఏళ్లలో ఏటా సగటున 5 లక్షల మంది పరీక్షలు రాసినట్లు అంచనా వేసినా విద్యార్థుల సంఖ్య 2 కోట్లు దాటుతోంది. ఇప్పుడు వారందరికీ సంబంధించిన సబ్జెక్టులవారీ మార్కుల సమగ్ర సమాచారంతోపాటు ఇతరత్రా వివరాలను కంప్యూటరీకరిం చేందుకు పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఇది పూర్తయితే రాష్ట్రంలో పదో తరగతి చదువుకున్న వారి సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.