Board of Secondary Education
-
టెన్త్ బోర్డు నిర్వాకం.. తీవ్ర విమర్శలు
భోపాల్: మధ్యప్రదేశ్ టెన్త్ బోర్డు చేసిన నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి సాంఘీక శాస్త్రం పరీక్షా పత్రంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ‘స్వతంత్ర కశ్మీర్’అని టెన్త్ బోర్డు పేర్కొంది. పరీక్షా పేపర్లోని నాలుగో ప్రశ్నలో ఈ తప్పు దొర్లింది. ఈ కింది వానిని జతపరుచుము అని పేర్కొన్న బోర్డు.. ఐదు ఐచ్ఛికాల (ఆప్షన్లు)ను ఇచ్చింది. (ఎ) బహదూర్ షా, (బి) కాంగ్రెస్ విభజన, (సి) భారత్ పాకిస్తాన్ యుద్ధం, (డి) సీఓపీఆర్‌ఓ, (ఇ) హాల్‌మార్క్ అని ఇచ్చింది. వాటికి ఎదురుగా.. (1) సూరత్, (2) వినియోగదారుల పరిరక్షణ చట్టం, (3) బంగారు ఆభరణాలు, (4) ఢిల్లీ, (5) స్వతంత్ర కశ్మీర్ అని పేర్కొంది. మరో ప్రశ్నలో కూడా అదే పొరపాటు చేసింది. భారత చిత్రపటంలో స్వతంత్ర కశ్మీర్‌ను గుర్తించండి అని ప్రశ్నించి అభాసుపాలైంది. ‘స్వతంత్ర కశ్మీర్’ దుమారం నేపథ్యంలో బీజేపీ నేత విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. ‘అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. స్వంత్రం కశ్మీర్ అని పేర్కొనడం ముమ్మాటికి రాజద్రోహమే. వక్రబుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. హిందుస్తాన్‌లో కాంగ్రెస్, పాకిస్తాన్ ఎజెండా అమలు చేయాలని చూస్తారా’అని విమర్శించారు. ఇదిలాఉండగా.. బాధ్యులపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత నరేంద్ర సాలుజా స్పష్టం చేశారు. కాగా, సీఎం ఆదేశాలమేరకు పేపర్ సెట్ చేసిన అధికారిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. -
పాతవి ‘పది’లం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్దాల కిందటి పదో తరగతి రికార్డులను కంప్యూటరీకరించేందుకు కసరత్తు మొదలైంది. 2004 నుంచి పదో తరగతి చదివిన విద్యార్థుల రికా ర్డుల కంప్యూటరీకరణ జరిగినా అంతకుముందు పదో తర గతి చదివిన వారి రికార్డుల ప్రక్రియ జరగలేదు. తాజాగా వాటిని కూడా కంప్యూటరీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. తద్వారా గత 61 ఏళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల వివరాలను సురక్షితంగా భద్రపరిచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఏర్పాట్లు చేస్తోంది. 2004 నుంచి ఏటా సగటున 9.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైతే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 1958 నుంచి 2004 వరకు 46 ఏళ్లలో ఏటా సగటున 5 లక్షల మంది పరీక్షలు రాసినట్లు అంచనా వేసినా విద్యార్థుల సంఖ్య 2 కోట్లు దాటుతోంది. ఇప్పుడు వారందరికీ సంబంధించిన సబ్జెక్టులవారీ మార్కుల సమగ్ర సమాచారంతోపాటు ఇతరత్రా వివరాలను కంప్యూటరీకరిం చేందుకు పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఇది పూర్తయితే రాష్ట్రంలో పదో తరగతి చదువుకున్న వారి సమగ్ర సమాచారం ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. -
ఇంటర్ ఇక లోకల్..!
పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ఓ శుభవార్త. ఇంటర్ చదువులకోసం పరుగులు పెట్టాల్సిన పనిలేదు. సీటు వస్తుందోరాదోనన్న బెంగలేదు. వ్యయప్రయాసల కోర్చి పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పదోతరగతి చదువుకునే పాఠశాలలోనే నచ్చిన కోర్సులో ఇంట ర్ విద్యను బోధించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 500 మంది విద్యార్థులుండే పాఠశాలలను కళాశాలలుగా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదముద్రవేసింది. సాక్షి, విజయనగం : పేద, మధ్యతరగతి విద్యార్థులు చాలామంది పదో తరగతి తరువాత మధ్యంతరంగా చదువులను ఆపేస్తున్నారు. బాలికలను దూరంగా ఉన్న కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. చదువులకు బలవంతంగా దూరం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాసంకల్పయాత్రలో పలువురు సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. తల్లిదండ్రుల కోరిక మేరకు... ప్రభు త్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాఠశాలలోనే ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. విద్యావేత్తల సూచనల మేరకు 500 మంది పిల్లలుండే పాఠశాలల్లో తొలివిడతలో ఇంటర్ తరగతుల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళాశాల విద్య ఆరంభం కానుంది. ఈ మేరకు మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. 21 పాఠశాలల్లో... ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ 500 మం ది విద్యార్థులు చదువుతున్న పాఠశాలల వివరాలను సేకరించింది. యూ–డైస్ నివేదికలో విద్యార్థుల వివరాల నమోదు ఆధారంగా జిల్లాలో 21 పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటి చదవుతున్నట్టు గుర్తించింది. ఈ పాఠశాలలు వచ్చే ఏడాది నుంచి కళాశాలలుగా మార్చేందుకు అర్హత పొందాయి. వీటిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఉన్నవి 19, కార్పొరేషన్ పరిధిలో 3, ప్రైవేటు ఎయిడెడ్ 1, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉన్నాయి. కార్పొరేషన్‌కు చెందిన విజయనగరం నగరపాలక కస్పా ఉన్నత పాఠశాల, బీపీఎంహెచ్‌స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చీపురుపల్లి, రామభద్రపురం, మక్కువ, పూసపాటిరేగ, జా మి, బలిజిపేట, కుమరాం, జొన్నవలస, కొత్తవలస, మెట్టపల్లి, పార్వతీపురం, పాంచాలి, తెర్లాం, బుడతనాపల్లి, ధర్మవరం, బాడంగి, అలుగోలు, గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. వీటిలో కళాశాల విద్య బోధిస్తే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్ విద్య ఊరిబడిలోనే చదువుకోవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఇంటర్ విద్య ఇలా... ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలను కలుపుకొని జిల్లాలో 184 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 21 వృత్తి విద్య కళాశాలలను మినహాయిస్తే 165 ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. 24 ప్రభుత్వ, 82 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వ విద్యలో జూనియర్ కళాశాలలకు డిమాండ్ జిల్లాలో ఏళ్లుగా సాగుతోంది. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేపట్టాయి. అధికారులు వీటిపై పరిశీలించి పలు దఫాలుగా ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో గుర్ల, గరుగుబిల్లి, బొండపల్లి, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల్లో డిమాండ్ మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు పరిశీలించి ఫీజుబులిటీ ఉందని బోర్డుకు నివేదించారు. మూడేళ్లుగా ఈ ప్రతిపాదనలపై కదలిక లేదు. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి గత ప్రభుత్వం దత్తిరాజేరు, మెరకముడిదాంలో ఇంటర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. కార్యరూపం దాల్చడంతో సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు రుసుములు భారం తగ్గి ఉన్నత విద్యను అందుకునే వీలు కలిగింది. ఇంకో ఏడు కళాశాలల ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇంటి వద్దకే ఇంటర్ చదువు ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులు ప్రవేశ పెట్టడం మంచి ఆలోచన. పదోతరగతి తరువాత ఆర్థిక భారంతో ఉన్నత చదువులు చదవలేని వారికి శుభపరిణామం. పదో తరగతి పాఠశాలలోనే ఇంటర్ చదువుకోవడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఉచితంగానే ఇంటి వద్దనే ఇంటర్ చదువుకోగల అవకాశం లభిస్తుంది. – టి.సన్యాసిరాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయ సంఘం -
‘పది’ మార్కులిస్టు పోయిందా?
డూప్లికేట్ సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి మార్కు లిస్టు పోతే దాన్ని ఎలా పొందాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అలాంటి వారు ఎస్బీఐలో రూ.250 చలానా చెల్లించి పూర్తి వివరాలను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు పంపి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. అది ఎలాగంటే.. * చలానాను పూరించే క్రమంలో కోడ్ల వివరాలు రాయాలి. అవి.. మేజర్ హెడ్-0202, ఎడ్యుకేషన్, సోర్ట్సు అండ్ కల్చర్ సబ్మేజర్ హెడ్ - 01, జనరల్ ఎడ్యుకేషన్ మైనర్ హెడ్-102, సెకండరీ ఎడ్యుకేషన్ సబ్‌హెడ్-006, డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిటెయిల్డ్ హెడ్ - 800, యూజర్ చార్జెస్ డీడీఓ కోడు- సంబంధిత పాఠశాలలో లభిస్తుంది. చలానాలో నేచర్ ఆఫ్ ఫీ అనే అంశం వద్ద డూప్లికేట్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ అని రాయాలి. * అభ్యర్థి పూర్తి పేరు(క్యాపిటల్ లెటర్స్), తండ్రిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, స్వస్థలం, పదో తరగతి చదివిన పాఠశాల, ఒరిజినల్ పదో తరగతి సీరియల్ నంబర్, రోల్ నంబర్, సంవత్సరం, ఏ నెలలో పాసైన వివరాలను బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు పదో తరగతి సర్టిఫికెట్ ఎలా పోయిందో తెలుపుతూ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు, వారు ఇచ్చిన నాన్ట్రేస్ సర్టిఫికెట్, నోటరీ ధ్రువీకరిచిన రూ.50 పత్రం, ఎస్బీఐలో చెల్లించిన చలానా రూ.250, ఎస్సీసీ నకలు జతపరచాల్సి ఉంటుంది. ఇంకా పుట్టుమచ్చల వివరాలు(సర్టిఫికెట్లో నమోదు చేసినవి), అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్, ధ్రువీకరిస్తూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన పత్రం, ఫొటో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కవరింగ్ లెటర్ జతపరచాల్సి ఉంటుంది. వీటన్నింటినీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు స్వయంగాగాని లేదా పోస్టులోగాని పంపి డూప్లికేట్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఈ క్రమంలో పాత మార్కుల లిస్టును బోర్డు రద్దు చేస్తుంది.