‘పది’ మార్కులిస్టు పోయిందా?
డూప్లికేట్ సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి మార్కు లిస్టు పోతే దాన్ని ఎలా పొందాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అలాంటి వారు ఎస్‌బీఐలో రూ.250 చలానా చెల్లించి పూర్తి వివరాలను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు పంపి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. అది ఎలాగంటే..
* చలానాను పూరించే క్రమంలో కోడ్ల వివరాలు రాయాలి. అవి.. మేజర్ హెడ్-0202, ఎడ్యుకేషన్, సోర్ట్సు అండ్ కల్చర్ సబ్‌మేజర్ హెడ్ - 01, జనరల్ ఎడ్యుకేషన్ మైనర్ హెడ్-102, సెకండరీ ఎడ్యుకేషన్ సబ్‌హెడ్-006, డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిటెయిల్డ్ హెడ్ - 800, యూజర్ చార్జెస్ డీడీఓ కోడు- సంబంధిత పాఠశాలలో లభిస్తుంది. చలానాలో నేచర్ ఆఫ్ ఫీ అనే అంశం వద్ద డూప్లికేట్ ఎస్‌ఎస్‌సీ పాస్ సర్టిఫికెట్ అని రాయాలి.
* అభ్యర్థి పూర్తి పేరు(క్యాపిటల్ లెటర్స్), తండ్రిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, స్వస్థలం, పదో తరగతి చదివిన పాఠశాల, ఒరిజినల్ పదో తరగతి సీరియల్ నంబర్, రోల్ నంబర్, సంవత్సరం, ఏ నెలలో పాసైన వివరాలను బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు పదో తరగతి సర్టిఫికెట్ ఎలా పోయిందో తెలుపుతూ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు, వారు ఇచ్చిన నాన్‌ట్రేస్ సర్టిఫికెట్, నోటరీ ధ్రువీకరిచిన రూ.50 పత్రం, ఎస్‌బీఐలో చెల్లించిన చలానా రూ.250, ఎస్‌సీసీ నకలు జతపరచాల్సి ఉంటుంది.
ఇంకా పుట్టుమచ్చల వివరాలు(సర్టిఫికెట్‌లో నమోదు చేసినవి), అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్, ధ్రువీకరిస్తూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన పత్రం, ఫొటో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కవరింగ్ లెటర్ జతపరచాల్సి ఉంటుంది. వీటన్నింటినీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు స్వయంగాగాని లేదా పోస్టులోగాని పంపి డూప్లికేట్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఈ క్రమంలో పాత మార్కుల లిస్టును బోర్డు రద్దు చేస్తుంది.