Duplicate certificate
-
డూప్లికేట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం..సెబీ
న్యూఢిల్లీ: డూప్లికేట్ (నకలు) సెక్యూరిటీ సర్టిఫికెట్ల జారీకి అనుసరించే విధానం, డాక్యుమెంటేషన్ ప్రక్రియను సెబీ సులభతరం చేసింది. సెక్యూరిటీ సర్టిఫికెట్ల నకలు కోరేవారు అందుకు సమర్పించాల్సిన పత్రాలతో జాబితాను సెబీ ప్రకటించింది. ప్రస్తుతం డూప్లికేట్ సెక్యూరిటీల సర్టిఫికెట్ల జారీకి రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏలు) అనుసరిస్తున్న విధానాన్ని సెబీ సమీక్షించింది. ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. డూప్లికేట్ సర్టిఫికెట్ కోరేవారు ఎఫ్ఐఆర్ కాపీ (ఈ–ఎఫ్ఐఆర్ కూడా) ఒరిజినల్ సెక్యూరిటీల ఫోలియో నంబర్, డిస్టింక్టివ్ నంబర్, సర్టిఫికెట్ నంబర్ల వివరాలను ఆర్టీఏలకు సమర్పించాలి. సెక్యూరిటీలు పోగొట్టుకున్నట్టు తెలియజేస్తూ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇవ్వాలి. అఫిడవిట్, ఇంటెమ్నిటీ బాండ్‌ను నిర్దేశిత విధానంలో సమర్పించాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎటువంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ దరఖాస్తు సమర్పించే నాటికి పోగొట్టుకున్న సెక్యూరిటీల విలువ రూ.5 లక్షకు మించకపోతే ఇవేవీ అవసరం లేదని సెబీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒకవేళ షేర్ సర్టిఫికెట్ నంబర్, ఫోలియో నంబర్, డిస్టింక్టివ్ నంబర్ ఇవేవీ లేకపోతే ఆర్టీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంతకం రికార్డులతో సరిపోలితే ఆర్టీఏ ఈ వివరాలను సెక్యూరిటీ హోల్డర్‌కు ఇవ్వాలని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిపోలేకపోతే అప్పుడు కేవైసీ వివరాలతో సెక్యూరిటీ హోల్డర్ తన గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత వివరాలు పొందాల్సి ఉంటుందని తెలిపింది. -
నకిలీలతో జాగ్రత్త..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉంటే యాజమాన్యాలపై చర్యలు చేపడతామని జేఎన్టీయూ పేర్కొంది. తమ కాలేజీల్లో చేరే ఫ్యాకల్టీకి సంబంధించిన సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. నకిలీ/ఇన్వ్యాలిడ్ సర్టిఫికెట్లు, నకిలీ పీహెచ్‌డీలు చూపించి ఏయే కోర్సులకు అనుబంధ గుర్తింపు పొందుతారో కాలేజీల్లో ఆయా కోర్సు లను రద్దు చేస్తామని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసే సమయంలో యాజమాన్యాలు చూపించే ఫ్యాకల్టీకి సంబంధించిన బయోమెట్రిక్ హాజరు వివరాలను ఏడాది పొడవునా పరిశీలిస్తామని, ఏ దశలోనైనా హాజరు లేకపోయినా వారు, కాలేజీలో లేకపోయినా ఆయా కోర్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అఫీలియేషన్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను జేఎన్టీయూ సోమవారం ప్రకటించింది. దానిపై యాజమాన్యాలు మెయిల్ ద్వారా (feedbackaac@jntuh.ac.in) అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తెలపాలని స్పష్టం చేసింది. ఏటా పరిగణనలోకి తీసుకునే నిబంధనలతో పాటు ఈసారి కొత్త నిబంధనలను చేర్చింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ వెల్ఫేర్, కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అంశాలను పొందుపరిచింది. మరోవైపు ప్రభుత్వ అనుమతితో కొత్త కోర్సులకు, కాలేజీలకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే గడిచిన మూడేళ్లలో కాలేజీల్లో ప్రవేశాలు 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే గతంలో అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో లేని విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు వివిధ కారణాలతో తమ వద్దే పెట్టుకోవద్దనే నిబంధనను ఈసారి రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌లోని ప్రధాన అంశాలు.. ►కాలేజీల గవర్నింగ్ బాడీ సభ్యులు, గవర్నింగ్ బాడీ సమావేశాల మినిట్స్‌ను కచ్చితంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ►ఫ్యాకల్టీ బయోమెట్రిక్ హాజరును ఏడాది కాలంలో ఎప్పుడైనా పరిశీలిస్తారు. ఫ్యాకల్టీ లేకపోతే ఆ కోర్సుల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తారు. ►కాలేజీల్లో తమ ఉద్యోగులు, ఫ్యాకల్టీకి వర్తింపజేస్తున్న సర్వీసు రూల్స్‌ను కూడా యూనివర్సిటీకి అన్లైన్ అందజేయాలి. -
‘పది’ మార్కులిస్టు పోయిందా?
డూప్లికేట్ సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి మార్కు లిస్టు పోతే దాన్ని ఎలా పొందాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అలాంటి వారు ఎస్బీఐలో రూ.250 చలానా చెల్లించి పూర్తి వివరాలను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు పంపి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. అది ఎలాగంటే.. * చలానాను పూరించే క్రమంలో కోడ్ల వివరాలు రాయాలి. అవి.. మేజర్ హెడ్-0202, ఎడ్యుకేషన్, సోర్ట్సు అండ్ కల్చర్ సబ్మేజర్ హెడ్ - 01, జనరల్ ఎడ్యుకేషన్ మైనర్ హెడ్-102, సెకండరీ ఎడ్యుకేషన్ సబ్‌హెడ్-006, డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిటెయిల్డ్ హెడ్ - 800, యూజర్ చార్జెస్ డీడీఓ కోడు- సంబంధిత పాఠశాలలో లభిస్తుంది. చలానాలో నేచర్ ఆఫ్ ఫీ అనే అంశం వద్ద డూప్లికేట్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ అని రాయాలి. * అభ్యర్థి పూర్తి పేరు(క్యాపిటల్ లెటర్స్), తండ్రిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, స్వస్థలం, పదో తరగతి చదివిన పాఠశాల, ఒరిజినల్ పదో తరగతి సీరియల్ నంబర్, రోల్ నంబర్, సంవత్సరం, ఏ నెలలో పాసైన వివరాలను బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు పదో తరగతి సర్టిఫికెట్ ఎలా పోయిందో తెలుపుతూ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు, వారు ఇచ్చిన నాన్ట్రేస్ సర్టిఫికెట్, నోటరీ ధ్రువీకరిచిన రూ.50 పత్రం, ఎస్బీఐలో చెల్లించిన చలానా రూ.250, ఎస్సీసీ నకలు జతపరచాల్సి ఉంటుంది. ఇంకా పుట్టుమచ్చల వివరాలు(సర్టిఫికెట్లో నమోదు చేసినవి), అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్, ధ్రువీకరిస్తూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన పత్రం, ఫొటో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కవరింగ్ లెటర్ జతపరచాల్సి ఉంటుంది. వీటన్నింటినీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు స్వయంగాగాని లేదా పోస్టులోగాని పంపి డూప్లికేట్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఈ క్రమంలో పాత మార్కుల లిస్టును బోర్డు రద్దు చేస్తుంది. -
నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి అరెస్ట్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన కీలక సూత్రధారి బండి రమేష్‌ను శనివారం వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు వికలాంగ (మూగ, చెవిటి) ధ్రువీకరణ పత్రాలతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియూమకమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పందించిన అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణాధికారిగా నియమితులైన డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ విచారణ పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా డీఈఓ ద్వారా కలె క్టర్ జిల్లాలో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 16 మంది ఉపాధ్యాయులపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు ముందుగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లను అందజేసిన వ్యవహారంలో చేర్యాలకు చెందిన సూత్రధారి బండిరమేశ్తోపాటు మరికొంత మందిని పాత్రధారులుగా గుర్తించారు. నకిలీ వ్యవహారం కొనసాగిందిలా... ఉపాధ్యాయ నియామకాల కోసంప్రభుత్వ ప్రకటన వెలువడగానే వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ బండి రమేశ్ ముఠా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 లక్షల వసూలు చేసింది. ఆ తర్వాత వారు సంగారెడ్డి జిల్లా మెడికల్ బోర్డు నుంచి 1996, 97, 98లో జారీ చేసిన వికలాంగుల ధ్రువీకరణ పత్రం ద్వారా అభ్యర్థులను వికలాంగుల కోటాలో దరఖాస్తు చేయించారు. వారు ఎన్నికైన తర్వాత మెడికల్ టెస్టుకు వెళ్లే సమయంలో నిందితులు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రిలో పనిచేసే కొంతమంది సిబ్బందిని లోబరుచుకుని వారిద్వారా అభ్యర్థులకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వాటిని జిల్లా విద్యాశాఖ కార్యాలయూనికి పంపించారు. అంతేగాక డీఈఓ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులకు డబ్బు ఎరజూపి అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించి లక్షలాది రూపాయలు దండుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన బండి రమేష్ 2006లో తప్పుడు వికలాంగుల(మూగ, చెవుడు) ధ్రువీకరణపత్రంతో స్కూల్‌అసిస్టెంట్‌గా నియమితుడయ్యూడు. ఇదేతప్పుడు ధ్రువీకరణ పత్రంతో 2012లో వికలాంగుల కోటాలో ఏపీపీఎస్సీ గ్రూప్-1లో డీఏఓగా ఎంపికై సంగారెడ్డి మైనర్ ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తున్నాడు. అతడి కోసం గాలిస్తున్న పోలీస్ బృందానికి అందిన సమాచారంతో శనివారం హన్మకొండ బస్టాండ్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు అక్రమంగా వసూలు చేసి డబ్బులతో బంగారు, వెండి నగలను కొనుగోలు చేయడంతోపాటు కొంతడబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచాడు. సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్ ప్రాంతంలో రూ.40 లక్షలతో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విచారణ అనంతరం నిందితుడు ఇంటి నుంచి రూ.61 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, 425 గ్రాముల బంగారు బిస్కట్లు, 3 కేజీల వెండి, రెండు చిన్న గాజులు, నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగతా నిందితులను అరెస్టు చేస్తామని అర్బన్ క్రైం డీఎస్పీ ప్రకాష్‌రావు తెలిపారు. ఈ వ్యవహరంలో నిందితులను అరెస్టు చేయడంలో కృషిచేసిన క్రైం డీఎస్పీ ప్రకాష్‌రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాలస్వామి, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుళ్లు రవీందర్, రాజారాం నాయక్‌ను అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు.