నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి అరెస్ట్ | Conductor arrested for fake certificate | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి అరెస్ట్

Published Mon, Aug 26 2013 4:09 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

Conductor arrested for fake certificate

వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ :  ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన కీలక సూత్రధారి బండి రమేష్‌ను శనివారం వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు వికలాంగ (మూగ, చెవిటి) ధ్రువీకరణ పత్రాలతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియూమకమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పందించిన అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా విచారణకు ఆదేశించారు.

ఈ  మేరకు విచారణాధికారిగా నియమితులైన డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్ విచారణ పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా డీఈఓ ద్వారా కలె క్టర్ జిల్లాలో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 16 మంది ఉపాధ్యాయులపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదు చేయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు ముందుగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లను అందజేసిన వ్యవహారంలో చేర్యాలకు చెందిన సూత్రధారి బండిరమేశ్‌తోపాటు మరికొంత మందిని పాత్రధారులుగా గుర్తించారు.
 
నకిలీ వ్యవహారం కొనసాగిందిలా...
 ఉపాధ్యాయ నియామకాల కోసంప్రభుత్వ ప్రకటన వెలువడగానే వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ బండి రమేశ్ ముఠా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 లక్షల వసూలు చేసింది. ఆ తర్వాత వారు సంగారెడ్డి జిల్లా మెడికల్ బోర్డు నుంచి 1996, 97, 98లో జారీ చేసిన వికలాంగుల ధ్రువీకరణ పత్రం ద్వారా అభ్యర్థులను వికలాంగుల కోటాలో దరఖాస్తు చేయించారు. వారు ఎన్నికైన తర్వాత మెడికల్ టెస్టుకు వెళ్లే సమయంలో నిందితులు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో పనిచేసే కొంతమంది సిబ్బందిని లోబరుచుకుని వారిద్వారా అభ్యర్థులకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వాటిని జిల్లా విద్యాశాఖ కార్యాలయూనికి పంపించారు.

అంతేగాక డీఈఓ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులకు డబ్బు ఎరజూపి అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించి లక్షలాది రూపాయలు దండుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన బండి రమేష్ 2006లో తప్పుడు వికలాంగుల(మూగ, చెవుడు) ధ్రువీకరణపత్రంతో స్కూల్‌అసిస్టెంట్‌గా నియమితుడయ్యూడు. ఇదేతప్పుడు ధ్రువీకరణ పత్రంతో 2012లో వికలాంగుల కోటాలో ఏపీపీఎస్సీ గ్రూప్-1లో డీఏఓగా ఎంపికై సంగారెడ్డి మైనర్ ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తున్నాడు. అతడి కోసం గాలిస్తున్న పోలీస్ బృందానికి అందిన సమాచారంతో శనివారం హన్మకొండ బస్టాండ్‌లో అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితుడు అక్రమంగా వసూలు చేసి డబ్బులతో బంగారు, వెండి నగలను కొనుగోలు చేయడంతోపాటు కొంతడబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచాడు. సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్ ప్రాంతంలో రూ.40 లక్షలతో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
విచారణ అనంతరం నిందితుడు ఇంటి నుంచి రూ.61 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 425 గ్రాముల బంగారు బిస్కట్లు, 3 కేజీల వెండి, రెండు చిన్న గాజులు, నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగతా నిందితులను అరెస్టు చేస్తామని అర్బన్ క్రైం డీఎస్పీ ప్రకాష్‌రావు తెలిపారు. ఈ వ్యవహరంలో నిందితులను అరెస్టు చేయడంలో కృషిచేసిన క్రైం డీఎస్పీ ప్రకాష్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుళ్లు రవీందర్, రాజారాం నాయక్‌ను అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement