సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉంటే యాజమాన్యాలపై చర్యలు చేపడతామని జేఎన్టీయూ పేర్కొంది. తమ కాలేజీల్లో చేరే ఫ్యాకల్టీకి సంబంధించిన సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. నకిలీ/ఇన్‌వ్యాలిడ్ సర్టిఫికెట్లు, నకిలీ పీహెచ్‌డీలు చూపించి ఏయే కోర్సులకు అనుబంధ గుర్తింపు పొందుతారో కాలేజీల్లో ఆయా కోర్సు లను రద్దు చేస్తామని వెల్లడించింది.
అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసే సమయంలో యాజమాన్యాలు చూపించే ఫ్యాకల్టీకి సంబంధించిన బయోమెట్రిక్ హాజరు వివరాలను ఏడాది పొడవునా పరిశీలిస్తామని, ఏ దశలోనైనా హాజరు లేకపోయినా వారు, కాలేజీలో లేకపోయినా ఆయా కోర్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అఫీలియేషన్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను జేఎన్టీయూ సోమవారం ప్రకటించింది. దానిపై యాజమాన్యాలు మెయిల్ ద్వారా (feedbackaac@jntuh.ac.in) అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తెలపాలని స్పష్టం చేసింది.
ఏటా పరిగణనలోకి తీసుకునే నిబంధనలతో పాటు ఈసారి కొత్త నిబంధనలను చేర్చింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ వెల్ఫేర్, కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అంశాలను పొందుపరిచింది. మరోవైపు ప్రభుత్వ అనుమతితో కొత్త కోర్సులకు, కాలేజీలకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే గడిచిన మూడేళ్లలో కాలేజీల్లో ప్రవేశాలు 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే గతంలో అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో లేని విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు వివిధ కారణాలతో తమ వద్దే పెట్టుకోవద్దనే నిబంధనను ఈసారి రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది.
డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌లోని ప్రధాన అంశాలు..
►కాలేజీల గవర్నింగ్ బాడీ సభ్యులు, గవర్నింగ్ బాడీ సమావేశాల మినిట్స్‌ను కచ్చితంగా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
►ఫ్యాకల్టీ బయోమెట్రిక్ హాజరును ఏడాది కాలంలో ఎప్పుడైనా పరిశీలిస్తారు. ఫ్యాకల్టీ లేకపోతే ఆ కోర్సుల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తారు.
►కాలేజీల్లో తమ ఉద్యోగులు, ఫ్యాకల్టీకి వర్తింపజేస్తున్న సర్వీసు రూల్స్‌ను కూడా యూనివర్సిటీకి అన్‌లైన్ అందజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment