ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అనుమానం వద్దు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Speech At JNTU Over Quality Of Engineering Education, More Details Inside | Sakshi
Sakshi News home page

CM Revanth Reddy: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం

Published Sat, Jul 13 2024 5:42 PM | Last Updated on Sat, Jul 13 2024 6:37 PM

CM Revanth Reddy Speech At JNTU Quality Of Engineering  education at JNTU

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 

‘ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారు. రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం. ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్‌టైమ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. 

దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి. 

ఇంజనీరింగ్‌లో కేవలం కంప్యూటర్ సైన్స్‌పైనే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. 

నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను తీసుకురాబోతున్నాం. 

యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా.. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement