
పన్నుల వడ్డింపునకే కేబుల్‌టీవీ డిజిటైజేషన్!
న్యూఢిల్లీ: వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి.
డిజిటైజేషన్‌కు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 800 టీవీ చానెళ్లు, 245 ఎఫ్‌ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి