హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీ ఇంట్లో సెట్ టాప్ బాక్సు ఉందా? లేకుంటే ఈ రోజే సెట్ టాప్ బాక్స్(ఎస్‌టీబీ) అమర్చుకోండి. ఎందుకంటే డిజిటైజేషన్‌లో భాగంగా సెప్టెంబరు 19 నుంచి హైదరాబాద్ నగరంలో అనలాగ్ సిగ్నల్స్ కనుమరుగవుతున్నాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతాయి. డిజిటల్ సిగ్నల్స్ అందుకోవాలంటే కేబుల్ టీవీ ప్రేక్షకులు తప్పనిసరిగా ఎస్‌టీబీ అమర్చుకోవాల్సిందే. నగరంలో డిజిటైజేషన్ ఈ ఏడాది మార్చి 31కే పూర్తి కావాలి. కేబుల్‌ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల18 వరకు గడువు ఇస్తూ గత నెల తీర్పు వెలువరించింది.
70 శాతం పూర్తి...
రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకే దీనిని పరిమితం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్‌టీబీలు అమర్చుకున్నారు. కేబుల్ టీవీ కనెక్షన్లలో 60 శాతం మంది ఎస్‌టీబీలను కొనుగోలు చేశారని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’ కి తెలిపారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే..
నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.