సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన విద్యపై ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరోసారి విషం కక్కారు. పేదల చదువులపై పూర్తి వక్రీకరణలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రికలో కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగానే ఈ కథనం ప్రచురించారు. ఈ కథనంలోని డొల్లతనాన్ని, రామోజీ ఏడుపుగొట్టుతనాన్ని ప్రభుత్వం బట్టబయలు చేసింది.
♦ బెస్ట్ అవైలబుల్ పథకంలో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు అందేదని ఈనాడు రాసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పలు పథకాల ద్వారా విద్యార్థులకు మేలు చేస్తోంది. అత్యుత్తమ విద్యను అందిస్తోంది. ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తోంది. ఇవికాక ప్రభుత్వ విద్యా రంగంలో ప్రతి విద్యార్థి మీద ఏడాదికి అదనంగా చేస్తున్న ఖర్చు రూ.30 వేల పైనే.
♦ బెస్ట్ అవైలబుల్ పథకం కొందరికే అందేది. అంటే మిగిలిన విద్యార్థులకు నాసిరకం చదువులు అందినా పర్వాలేదనేది ఈనాడు అభిప్రాయమా? ఇది పేదలు, ఎస్సీ, ఎస్టీలు బడుగు, బలహీనవర్గాల వారికి అన్యాయం చేసినట్టుగా కాదా? అందరికీ నాణ్యమైన విద్య అందడం ఈనాడుకి ఇష్టంలేదా?
♦ మంచి చదువులు ఏ ఒక్కరికో కాదు.. అందరికీ సమానంగా అందాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకే కార్పొరేట్ స్కూళ్లకంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. మన బడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. తొలి దశలో రూ.3,699 కోట్లతో 15,715 స్కూళ్లలో సదుపాయాలు కల్పించింది. రెండో దశలో మరో 22,344 స్కూళ్లను రూ.8,000 కోట్లతో బాగుచేస్తోంది. ఇందులో ఇప్పటికే రూ.2,949 కోట్లు ఖర్చు చేసింది. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రైవేటు స్కూళ్లలో కూడా లేవన్నది నిజం.
♦ పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం విప్లవాత్మక మార్పుగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాకుండా, ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారికీ వర్తిస్తోంది. అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్లలో సుమారు 45 లక్షల మంది తల్లులు అందుకున్న మొత్తం రూ.26,067.28 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి రూ.100 కోట్లు ఎక్కడ? ఒక్క అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన రూ.26,067.28 కోట్లు ఎక్కడ? ఈ పథకం ద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పిల్లలు ఎంతగానో లబ్ధిపొందారు.
♦ విద్యా రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల 14,28,568 మంది ఎస్సీ విద్యార్థులు, 5,19,116 మంది ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందారు. మరోవైపు 10వ తరగతి, ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 22,761 మంది విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రభుత్వం సత్కరించింది.
♦ జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. దీనికి రాగిజావను కూడా ఇటీవల అదనంగా చేర్చింది. ఈ నాలుగేళ్లలో కేవలం జగనన్న గోరుముద్ద పథకం మీద పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.4,286.7 కోట్లు. ఇలాంటి ఆహారాన్ని ఉచితంగా ఏ ప్రైవేటు పాఠశాలలైనా అందిస్తున్నాయా?
♦ బడికి వెళ్లే పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద వారికి కావాలి్సన యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్టు, సాక్సులు, ఇంగ్లిష్ డిక్షనరీ, వర్క్స్ బుక్స్ లాంటివాటిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం నాలుగేళ్లలో చేసిన ఖర్చు అక్షరాలా రూ.3,366.53 కోట్లు. చంద్రబాబు అమలు చేసిన స్కీమ్‌లో ప్రైవేటు పాఠశాలలు ఇలాంటివి అందించాయా?
♦ అందరికీ ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, టోఫెల్‌లో శిక్షణ, పరీక్షలు ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయా?
♦ కార్పొరేట్ పాఠశాలలు పోటీ పడలేనంతగా ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయిలో ఉంచే మరో అంశం డిజిటలీకరణ. గ్లోబల్ సిటిజన్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనిపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. ఆరు, ఆపై తరగతుల వారికి ప్రతి తరగతి గదిలో ఒక ఐఎఫ్‌పీ ప్యానెల్ ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రూ.440 కోట్లతో 30,213 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ఏర్పాటు చేసింది. రెండో దశలో మరో రూ.520 కోట్లు ఖర్చు చేస్తోంది. 5వ తరగతి లోపు 10,038 తరగతి గదుల్లో తొలిదశలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఎన్నో ఈనాడు చెప్పగలదా?
♦ డిజిటల్ విద్యలో భాగంగా 4 నుంచి 10వ వతరగతి వరకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వం అందిస్తోంది. అంతేకాక 8వ తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌ను ఉచితంగా ఇస్తోంది. ఇందుకోసం 5.18 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.686 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా సౌకర్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వీటిద్వారా మేలు పొందడంలేదా? ఇలా గడచిన 50 నెలల్లో ప్రభుత్వ విద్యా రంగం మీద చేసిన ఖర్చు అక్షరాలా రూ.68,607 కోట్లు.
విద్యార్ధులకు మేలు జరిగేలా చర్యలు
బెస్ట్ అవైలబుల్ స్కీంలో చేరిన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 9, 10 తరగతులు వారిని అదే పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. మిగిలిన విద్యార్థులు వారు కోరుకున్న ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. వీరికి ప్రభుత్వ పరంగా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే అన్ని పథకాలు, సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది పూర్తిగా అవాస్తవం.
ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఏంటంటే
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా గుర్తించిన చాలా పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు లేవు. వరుసగా ఐదేళ్లపాటు పదో తరగతిలో 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించాలి. అందులో 50% విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఫలితాలు సాధించిన స్కూళ్లే ఈ స్కీంకు అర్హత పొందుతాయి. ఈ నిబంధనలేవీ ఎంపిక చేసిన స్కూళ్లలో లేవు అని ప్రభుత్వం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment