
మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చిత్రంలో కమిషనర్ వాణీమోహన్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి దేవుడి నగల వివరాలన్నిటినీ డిజటలీకరణ చేయాలని దేవదాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. దేవుడికి సంబంధించిన బంగారు, వెండి నగలను అన్నివైపుల నుంచి ఫొటోలు తీసి, ఆ నగ బరువు వివరాలతో సహా కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గొల్లపూడిలోని కమిషనర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి.
ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వాణీమోహన్, ఆర్‌జేసీలు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన ఆలయాల ఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ఎటువంటి అవకతవకలకు అవకాశాలు లేకుండా పూర్తి పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చేందుకు.. దేవుడి నగలతో పాటు ఆలయ భూములు, ఇతర ఆస్తులు, లీజుల వివరాలతోపాటు ఆలయాలకు ఏటా ఏ రూపంలో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తం ఖర్చవుతోంది, బ్యాంకులలో డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయనే వివరాలను ఆలయాల వారీగా నిర్వహించే 6 రకాల రిజిస్టర్లను కూడా కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆయా ఆలయాల్లో వెంటనే చేపట్టాలని మంత్రి వెలంపల్లి, వాణీమోహన్ సూచించారు.
జమా ఖర్చులపై విధిగా ఆడిట్
జమా ఖర్చులకు సంబంధించి ఆలయాల వారీగా ఏటా ఆడిట్ జరిపించాలని మంత్రి వెలంపల్లి ఆదేశించారు. దశలవారీగా పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ విధానం అమలు చేయాలన్నారు. దేవుడి భూములు, షాపులు, ఇతర లీజులకు సంబంధించి ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేయాలని సూచించారు. ఆలయాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆలయాలపై దాడులు జరిగినా దేవదాయ శాఖ స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తుందని హెచ్చరించారు.