Vanimohan
-
దేవుడి నగల వివరాల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి దేవుడి నగల వివరాలన్నిటినీ డిజటలీకరణ చేయాలని దేవదాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. దేవుడికి సంబంధించిన బంగారు, వెండి నగలను అన్నివైపుల నుంచి ఫొటోలు తీసి, ఆ నగ బరువు వివరాలతో సహా కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గొల్లపూడిలోని కమిషనర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వాణీమోహన్, ఆర్జేసీలు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన ఆలయాల ఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ఎటువంటి అవకతవకలకు అవకాశాలు లేకుండా పూర్తి పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చేందుకు.. దేవుడి నగలతో పాటు ఆలయ భూములు, ఇతర ఆస్తులు, లీజుల వివరాలతోపాటు ఆలయాలకు ఏటా ఏ రూపంలో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తం ఖర్చవుతోంది, బ్యాంకులలో డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయనే వివరాలను ఆలయాల వారీగా నిర్వహించే 6 రకాల రిజిస్టర్లను కూడా కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆయా ఆలయాల్లో వెంటనే చేపట్టాలని మంత్రి వెలంపల్లి, వాణీమోహన్ సూచించారు. జమా ఖర్చులపై విధిగా ఆడిట్ జమా ఖర్చులకు సంబంధించి ఆలయాల వారీగా ఏటా ఆడిట్ జరిపించాలని మంత్రి వెలంపల్లి ఆదేశించారు. దశలవారీగా పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ విధానం అమలు చేయాలన్నారు. దేవుడి భూములు, షాపులు, ఇతర లీజులకు సంబంధించి ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేయాలని సూచించారు. ఆలయాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆలయాలపై దాడులు జరిగినా దేవదాయ శాఖ స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తుందని హెచ్చరించారు. -
ఆలయాల్లో నిరంతర తనిఖీలు
సాక్షి, అమరావతి: భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా ఆలయాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. జిల్లా స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ మొదలు.. డిప్యూటీ కమిషనర్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ)లు వారానికి మూడు, నాలుగు రోజుల పాటు తమ పరిధిలో తనిఖీలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ తాజాగా ఆదేశాలిచ్చారు. 6(ఏ) కేటగిరిలో ఉండే పెద్ద ఆలయాల్లో ఏటా ఒకసారైనా, 6(బీ) కేటగిరి ఆలయాల్లో రెండేళ్లకోసారి, 6(సీ) కేటగిరి ఆలయాల్లో మూడేళ్లకోసారైనా తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. తనిఖీ జరిపే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోనే ఉండి.. అన్ని రకాల ఆలయ రికార్డులను పరిశీలించాలని, గుర్తించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్, ఆర్జేసీ స్థాయి అధికారులు ప్రతి నెలా తమ పరిధిలోని ఏదో ఒక ఆలయానికి తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో పర్యటించడంతో పాటు రాత్రి వేళ కూడా ఏదో ఒక ఆలయంలోనే బస చేసి, అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. -
అరచేతిలో ఆలయ సమాచారం
సాక్షి, అమరావతి: తరచూ ఆలయాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం దేవదాయ శాఖ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా వారికి అందజేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయం విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే వారితోపాటు రాష్ట్రంలోనూ ఆలయ సమాచారాన్ని ఇంటర్నెట్లో వెతికేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దూర ప్రాంతాల్లో ఉండే భక్తులకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు తెలీక ఆయా దేవాలయాల్లోని విశేష కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు అందజేసేందుకు వారు ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు దేవదాయ శాఖాధికారులు వెల్లడించారు. మొదటి దశలో 175 ఆలయాల సమాచారం ఈ తరహా సమాచారాన్ని ముందుగా దేవదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల కేటగిరీలో ఉన్న 175 గుళ్ల సమాచారాన్ని భక్తులకు చేరవేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఇప్పటివరకు వివిధ ఆలయాల్లో భక్తులు దర్శన లేదా పూజా టికెట్ల కొనుగోలు సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్లను వినియోగించుకోవాలని భావిస్తోంది. వాటి ఆధారంగా భక్తులకు వివిధ ఆలయాల్లోని పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు. ఆన్లైన్లో టికెట్ల కొనుగోలుతో పాటు ఆలయం వద్ద బస సౌకర్యం కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తారు. మరోవైపు.. ఈ సమాచారాన్ని సోషల్ మీడియాకు అనుసంధానం చేసేందుకు.. ఆయా కార్యక్రమాలకు డిజిటల్ మార్కెటింగ్ కల్పించేందుకు ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే టెండరు ప్రక్రియను చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువయ్యేలా.. రాష్ట్రంలో ఉండే ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలను మొబైల్ ద్వారా భక్తులు తెలుసుకునేలా యూజర్ ఫ్రెండ్లీగా ఈ ప్రక్రియను రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. – వాణీమోహన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి -
వాణీమోహన్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి జీ.వాణీమోహన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పరిశీలకులుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్‌గా, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో– ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రశాంత వాతావరణంలో వాటిని నిర్వహించడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. -
విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే
విద్య, ఆరోగ్యం రెండూ ముఖ్యమే మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయాలి పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత గురువులదేనని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, మోడల్ స్కూల్స్, కేజీబీ వీల స్పెషల్ ఆఫీసర్లు, ఐదో జోన్‌లోని జిల్లా విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండూ ముఖ్యమేనని, ఇందులో విద్యను అతి ముఖ్యమైనదిగా భావిస్తానని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అర్థమయ్యే విధంగా బోధన చేయాలని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దుతుందని, మరికొన్ని చోట్ల విద్యార్థులకు సరిగా చదవడం, రాయడం కూడా రావడం లేదని ఆమె వివరించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. కొందరు ఉపాధ్యాయులు విజ్ఞప్తులను పట్టుకుని విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల విద్యార్థులకు జరిగే నష్టం అంతాఇంతా కాదన్నా రు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం సక్రమంగా అమలు కు కృషిచేయాలని ఆదేశించారు. కుకింగ్ ఏజెన్సీలు భోజనం తయారు చేసేటప్పుడు పరిశుభ్రతను పాటించటంలేదని వివరించారు. పాఠశాలల్లోని హెచ్ఎంలు ప్రతి నెల ఒక ఉపాధ్యాయుడిని ఇన్చార్జ్గా నియమించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించేలా చర్య తీసుకోవాలని కోరారు. దాతలు, తమ పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో వారంలో అదనంగా మరో గుడ్డు కూడా విద్యార్థులకు అందించవచ్చని పేర్కొన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు రాజీవ్ విద్యామిషన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ ద్వారా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని వెల్లడించారు. టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తే హెచ్ఎంలు, డీఈఓలకు ప్రో త్సాహక బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి : కలెక్టర్ కిషన్ గత ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లాకు నాలుగో స్థానం వచ్చిం దని కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు వచ్చినా తెలుగు సబ్జెక్టులో 637 మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరును సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతృభాషలోనే ఫెయిల్ అయితే ఇక విద్యార్థుల పరిస్థితి ఏమిటని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కొందరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు డీఈఓ పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు వెల్లడైందని వివరించారు. దీనికి మీరేకాదు నేను కూడా బాధ్యుడేనని కలెక్టర్ చెప్పారు. ఉపాధ్యాయులు బాధ్యతలను విస్మరించి ఎప్పుడు హక్కుల కోస మే పనిచేస్తుంటారని, ఇప్పటికైనా 90 శాతం బాధ్యతలు నిర్వర్తించేలా కృషిచేయాలని కోరారు. టెన్త్ పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే సాయంత్రం వేళ తాను భోజన వసతి కూడా ఏర్పాటు చేయించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఓరుగల్లు సేవాసమితి ట్రస్టు ద్వారా నిధుల ను అవసరమైతే విద్యార్థుల కోసం ఖర్చుచేస్తామని ఆయన వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, జిల్లా విద్యాశాఖాధికారులు డాక్టర్ ఎస్.విజయకుమార్, కె.లింగయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి, భద్రాచలం ఏజెన్సీ డీఈఓ రాజేష్, ఆదిలాబాద్ ఇన్చార్జ్ డీఈఓ పీవీజే.రామారావు, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, రేణుక, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, నరేందర్‌రెడ్డి, జయవీర్రావు, పి.వజ్రయ్యతో పాటు అన్ని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. మీలో ఎందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు? సమావేశానికి హాజ రైన హెచ్ఎంలు, విద్యాశాఖాధికారు లు ఎందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి స్తున్నారని కలెక్టర్ కిషన్ ప్రశ్నించగా ఇద్దరే చేతులెత్తారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులు అర్బన్ ప్రాంతానికి వచ్చి తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకుంటున్నారని, ప్రభు త్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా మీలో మార్పురావాలి, ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీ క్షల్లో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. గుర్తింపులేని పాఠశాలలకు నోటీసులు ఇవ్వాలి గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని వాణీమోహన్ డీఈఓలను ఆదేశించారు. అంబేద్కర్ భవన్లో ఐదో జోన్‌లోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డీఈఓలు, డిప్యూటీ డీఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే గుర్తింపులేని పాఠశాల లు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాల ల యాజమాన్యాలకు షోకాజ్ నోటీస్‌లు ఇవ్వాలని డీఈఓలను ఆదేశించారు. గుర్తింపులేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించ డం అనేక సమస్యలు వస్తున్నాయని వివరించారు. డిప్యూటీ డీఈఓలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీచేసి మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలవుతుందా లేదా అనేది పరిశీలించాలన్నారు. డిప్యూటీ డీఈఓలకు ఇటీవలనే వాహనాలను కూడా సమకూర్చామని.. పాఠశాలలు, మోడల్ స్కూళ్ల తనిఖీలు ముమ్మురం చేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆది లాబాద్ జిల్లాల, భద్రాచలం ఏజెన్సీ డీఈఓలు డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, రవీంధ్రనాథ్‌రెడ్డి, కె.లింగయ్య, పీవీజే.రామారావు, రాజేష్, డిప్యూటీ డీఈఓలు అబ్దుల్‌హై, డి.వాసంతి, రేణుక, నరేందర్‌రెడ్డి, జయవీర్రావు, పి.వజ్రయ్య పాల్గొన్నారు. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి మోడల్ స్కూళ్లలో నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. ఈమేరకు డీఈ ఓ కార్యాలయానికి ఆదివారం వచ్చిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ కు వారు వినతిపత్రం అందజేశారు. మినీస్టీరియల్ బాధ్యులు వేణుగోపాల్, ఫకృద్దీన్, ఉస్మా న్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, మోడల్ స్కూళ్ల లో పనిచేస్తున్న పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ రాష్ర్ట కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్‌కు మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్‌రూల్స్ లేక పోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు హెల్త్‌కార్డులు, పీఆర్సీ, మధ్యంతర భృతి ఇప్పించాలని కోరారు. తెలంగా ణ మోడల్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ బాధ్యు డు దామెర రాజేందర్ కూడా పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. -
పాఠశాలల పర్యవేక్షణ తప్పనిసరి
నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్‌లో ఉంచొద్దని సూచన విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన జరుగుతుందా లేదా అనే అంశాన్ని తెలుసుకునేందుకు విద్యాశాఖ అధికారులు తరచుగా పాఠశాలలను పర్యవేక్షించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ ఆదేశించారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయాన్ని శనివారం సందర్శించిన ఆమె ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు పాఠశాలలను పర్యవేక్షించాలని, ఉపాధ్యాయులు తమ విధులు వదులుకుని కార్యాలయానికి రాకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని, ఆర్వీఎం, ఆర్ఎంఏస్ఏ ద్వారా మంజూరవుతున్న నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అలాగే, నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలతో మాట్లాడి సౌకర్యాలు కల్పించేలా చూడాలని, లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇంకా ప్రైవేట్ డీఈడీ కళాశాలల పనితీరును గమనిస్తుండాలని, మోడల్‌స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, ఏడీలు వెంకటరమణ, ఎస్టానీ అహ్మద్, సూపరింటెండెంట్లు రంగయ్యనాయుడు, వేణుగోపాల్, రాథోడ్, సీనియర్ అసిస్టెంట్లు పకృద్దీన్తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాలకొండారెడ్డి, కొమ్ముల బాబు, దామెర ఉపేందర్,డ్రాయింగ్ మాస్టర్లు అశోక్, లక్పతి, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన విరాళాలతో డీఈఓ కార్యాలయంలో చేపట్టిన పనులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడలపై వేసిన మహనీయుల చిత్రపటాలు, స్ఫూర్తినిచ్చే సూక్తులను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, డీఈఓ కార్యాలయంపై రూ.30లక్షలతో మొదటి అంతస్తు నిర్మించగా, నిధులు మంజూరు కాలేదని ఆమె దృష్టికి డీఈఓ విజయ్‌కుమార్ తీసుకువెళ్లారు.