- విద్య, ఆరోగ్యం రెండూ ముఖ్యమే
- మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయాలి
- పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్
- అండ్ డెరైక్టర్ వాణీమోహన్
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత గురువులదేనని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, మోడల్ స్కూల్స్, కేజీబీ వీల స్పెషల్ ఆఫీసర్లు, ఐదో జోన్‌లోని జిల్లా విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండూ ముఖ్యమేనని, ఇందులో విద్యను అతి ముఖ్యమైనదిగా భావిస్తానని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అర్థమయ్యే విధంగా బోధన చేయాలని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దుతుందని, మరికొన్ని చోట్ల విద్యార్థులకు సరిగా చదవడం, రాయడం కూడా రావడం లేదని ఆమె వివరించారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. కొందరు ఉపాధ్యాయులు విజ్ఞప్తులను పట్టుకుని విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల విద్యార్థులకు జరిగే నష్టం అంతాఇంతా కాదన్నా రు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం సక్రమంగా అమలు కు కృషిచేయాలని ఆదేశించారు. కుకింగ్ ఏజెన్సీలు భోజనం తయారు చేసేటప్పుడు పరిశుభ్రతను పాటించటంలేదని వివరించారు.
పాఠశాలల్లోని హెచ్‌ఎంలు ప్రతి నెల ఒక ఉపాధ్యాయుడిని ఇన్‌చార్జ్‌గా నియమించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించేలా చర్య తీసుకోవాలని కోరారు. దాతలు, తమ పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో వారంలో అదనంగా మరో గుడ్డు కూడా విద్యార్థులకు అందించవచ్చని పేర్కొన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు రాజీవ్ విద్యామిషన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ ద్వారా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని వెల్లడించారు. టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తే హెచ్‌ఎంలు, డీఈఓలకు ప్రో త్సాహక బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి : కలెక్టర్ కిషన్
గత ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లాకు నాలుగో స్థానం వచ్చిం దని కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు వచ్చినా తెలుగు సబ్జెక్టులో 637 మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరును సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతృభాషలోనే ఫెయిల్ అయితే ఇక విద్యార్థుల పరిస్థితి ఏమిటని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కొందరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు డీఈఓ పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు వెల్లడైందని వివరించారు.
దీనికి మీరేకాదు నేను కూడా బాధ్యుడేనని కలెక్టర్ చెప్పారు. ఉపాధ్యాయులు బాధ్యతలను విస్మరించి ఎప్పుడు హక్కుల కోస మే పనిచేస్తుంటారని, ఇప్పటికైనా 90 శాతం బాధ్యతలు నిర్వర్తించేలా కృషిచేయాలని కోరారు. టెన్త్ పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే సాయంత్రం వేళ తాను భోజన వసతి కూడా ఏర్పాటు చేయించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఓరుగల్లు సేవాసమితి ట్రస్టు ద్వారా నిధుల ను అవసరమైతే విద్యార్థుల కోసం ఖర్చుచేస్తామని ఆయన వెల్లడించారు.
పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వై.బాలయ్య, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, జిల్లా విద్యాశాఖాధికారులు డాక్టర్ ఎస్.విజయకుమార్, కె.లింగయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి, భద్రాచలం ఏజెన్సీ డీఈఓ రాజేష్, ఆదిలాబాద్ ఇన్‌చార్జ్ డీఈఓ పీవీజే.రామారావు, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, రేణుక, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, నరేందర్‌రెడ్డి, జయవీర్‌రావు, పి.వజ్రయ్యతో పాటు అన్ని ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
మీలో ఎందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు?
సమావేశానికి హాజ రైన హెచ్‌ఎంలు, విద్యాశాఖాధికారు లు ఎందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి స్తున్నారని కలెక్టర్ కిషన్ ప్రశ్నించగా ఇద్దరే చేతులెత్తారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులు అర్బన్ ప్రాంతానికి వచ్చి తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకుంటున్నారని, ప్రభు త్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా మీలో మార్పురావాలి, ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీ క్షల్లో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు.
గుర్తింపులేని పాఠశాలలకు నోటీసులు ఇవ్వాలి
గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని వాణీమోహన్ డీఈఓలను ఆదేశించారు. అంబేద్కర్ భవన్‌లో ఐదో జోన్‌లోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డీఈఓలు, డిప్యూటీ డీఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే గుర్తింపులేని పాఠశాల లు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాల ల యాజమాన్యాలకు షోకాజ్ నోటీస్‌లు ఇవ్వాలని డీఈఓలను ఆదేశించారు. గుర్తింపులేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించ డం అనేక సమస్యలు వస్తున్నాయని వివరించారు.
డిప్యూటీ డీఈఓలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీచేసి మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలవుతుందా లేదా అనేది పరిశీలించాలన్నారు. డిప్యూటీ డీఈఓలకు ఇటీవలనే వాహనాలను కూడా సమకూర్చామని.. పాఠశాలలు, మోడల్ స్కూళ్ల తనిఖీలు ముమ్మురం చేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వై.బాలయ్య, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆది లాబాద్ జిల్లాల, భద్రాచలం ఏజెన్సీ డీఈఓలు డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, రవీంధ్రనాథ్‌రెడ్డి, కె.లింగయ్య, పీవీజే.రామారావు, రాజేష్, డిప్యూటీ డీఈఓలు అబ్దుల్‌హై, డి.వాసంతి, రేణుక, నరేందర్‌రెడ్డి, జయవీర్‌రావు, పి.వజ్రయ్య పాల్గొన్నారు.
నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి
మోడల్ స్కూళ్లలో నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. ఈమేరకు డీఈ ఓ కార్యాలయానికి ఆదివారం వచ్చిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ కు వారు వినతిపత్రం అందజేశారు. మినీస్టీరియల్ బాధ్యులు వేణుగోపాల్, ఫకృద్దీన్, ఉస్మా న్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, మోడల్ స్కూళ్ల లో పనిచేస్తున్న పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ రాష్ర్ట కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్‌కు మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్‌రూల్స్ లేక పోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు హెల్త్‌కార్డులు, పీఆర్‌సీ, మధ్యంతర భృతి ఇప్పించాలని కోరారు. తెలంగా ణ మోడల్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ బాధ్యు డు దామెర రాజేందర్ కూడా పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.