సిట్ అదుపులో రాచకొండ ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు
ట్యాపింగ్, బెదిరింపులతో వసూళ్ల కోణంలో విచారణ
టాస్క్‌ఫోర్స్‌కు చెందిన నలుగురిని ప్రశ్నించిన సిట్
పోలీసు కస్టడీకి తిరుపతన్న, భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పంజగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు గతంలో టాస్‌్క ఫోర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు.
తొలుత డీసీపీగా, తర్వాత ఓఎస్డీగా..
గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్–క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్ 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది.
అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పారీ్టకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు.
ప్రభాకర్‌రావుతో కలిసి భారీ వసూళ్లు..
ఎస్‌ఐబీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ వ్యవహారాల్లో రాధాకిషన్‌రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్‌రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్‌ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్‌తో పాటు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్‌రావు పాత్రపై సిట్‌కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్‌రావు గురువారం పోలీసులకు చిక్కారు.
ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు ఇద్దరికీ సన్నిహితుడే..
సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్‌ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న నలుగురు అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్‌రావు హయాంలోనూ టాస్‌్కఫోర్స్‌లోనే పని చేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్.. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషి స్తోంది.
భుజంగరావు, మేకల తిరుపతన్న సస్పెన్షన్
జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్‌రావు అదనపు కస్టడీ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఇలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిని ఈనెల 23న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment