- నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలి
- పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్
- ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్‌లో ఉంచొద్దని సూచన
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన జరుగుతుందా లేదా అనే అంశాన్ని తెలుసుకునేందుకు విద్యాశాఖ అధికారులు తరచుగా పాఠశాలలను పర్యవేక్షించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ ఆదేశించారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయాన్ని శనివారం సందర్శించిన ఆమె ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు పాఠశాలలను పర్యవేక్షించాలని, ఉపాధ్యాయులు తమ విధులు వదులుకుని కార్యాలయానికి రాకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని, ఆర్‌వీఎం, ఆర్‌ఎంఏస్‌ఏ ద్వారా మంజూరవుతున్న నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అలాగే, నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలతో మాట్లాడి సౌకర్యాలు కల్పించేలా చూడాలని, లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఇంకా ప్రైవేట్ డీఈడీ కళాశాలల పనితీరును గమనిస్తుండాలని, మోడల్‌స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, ఏడీలు వెంకటరమణ, ఎస్టానీ అహ్మద్, సూపరింటెండెంట్లు రంగయ్యనాయుడు, వేణుగోపాల్, రాథోడ్, సీనియర్ అసిస్టెంట్లు పకృద్దీన్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాలకొండారెడ్డి, కొమ్ముల బాబు, దామెర ఉపేందర్,డ్రాయింగ్ మాస్టర్లు అశోక్, లక్‌పతి, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
విరాళాలతో డీఈఓ కార్యాలయంలో చేపట్టిన పనులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడలపై వేసిన మహనీయుల చిత్రపటాలు, స్ఫూర్తినిచ్చే సూక్తులను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, డీఈఓ కార్యాలయంపై రూ.30లక్షలతో మొదటి అంతస్తు నిర్మించగా, నిధులు మంజూరు కాలేదని ఆమె దృష్టికి డీఈఓ విజయ్‌కుమార్ తీసుకువెళ్లారు.