ఇక ఈ–పాస్‌బుక్కు | The government is building a plan to build a fake book books. | Sakshi
Sakshi News home page

ఇక ఈ–పాస్‌బుక్కు

Published Tue, Jul 18 2017 5:45 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

ఇక ఈ–పాస్‌బుక్కు - Sakshi

ఇక ఈ–పాస్‌బుక్కు

అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు
పాత పుస్తకాల పంపిణీ నిలిపివేత
ఆధునిక పరిజ్ఞానంతో కొత్త పుస్తకాలు
నకిలీలకు చెక్‌ పెట్టేందుకు ‘డిజిటల్‌’
ఆన్‌లైన్‌ పనులు చేపడుతున్న అధికారులు

నిర్మల్‌రూరల్‌: నకిలీ పాసు పుస్తకాల ఆట కట్టించేం దుకు.. రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈ–పాస్‌బుక్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో నకిలీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రెవెన్యూ శాఖలో అవినీతికి ముకుతాడు వేయొచ్చని భావిస్తోంది.

అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు మేలు జరిగేలా ఈ–పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని పనులను మీసేవతో లింకప్‌ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పాస్‌ పుస్తకాలనూ డిజిటలైజేషన్‌ చేసే పనికి శ్రీకారం చుట్టింది. పాస్‌ పుస్తకాలను మాన్యువల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మాన్యువల్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వొద్దని ఆదేశాలూ జారీ చేసింది.

పాత పుస్తకాలతో అక్రమాలు
ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఈ–పాస్‌ పుస్తకాల విధానానికి పనులు మొదలుపెట్టింది. భూమి హక్కులు పొందేందుకు రైతులకు గతంలో సర్వే నంబర్, విస్తీర్ణం ఆధారంగా పాస్‌ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో ఈ విధానానికి స్వస్తిచెప్పి.. రైతు పట్టా పుస్తకాల పేరిట టైటిల్‌ డీడ్, పాస్‌ పుస్తకం అనే రెండు రకాల పుస్తకాలను పంపిణీ చేశారు. వీటిలో భూమి స్వభావం, విస్తీర్ణం తదితర వివరాలు పొందుపర్చారు. అక్రమాలు చోటు చేసుకోకుండా వరుస సంఖ్య కేటాయించారు. అయినప్పటికీ పాస్‌ పుస్తకాల పంపిణీలో భారీగానే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. బోగస్‌ పట్టా పాస్‌ పుస్తకాల దందా చాలాచోట్ల వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్‌పుస్తకాల ద్వారా చాలామంది అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గతంలో పలు సంఘటనలూ బయటకు వచ్చాయి.

అవినీతిని అరికట్టేందుకు..
రెవెన్యూ శాఖలో ప్రధానంగా పాస్‌పుస్తకాల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. బోగస్‌ పుస్తకాలను తయారు చేసి ఇచ్చిన ఘటనలు అనేక జిల్లాల్లో కనిపించాయి. ఇందులో పలువురు అధికారులూ సస్పెండ్‌ అయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలను అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. బోగస్‌ పట్టాపాస్‌ పుస్తకాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భూముల కొనుగోలు, ఇతర కారణాలతో భూహక్కులను పొందుతున్న వారికి పాస్‌ పుస్తకాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలనూ జారీచేసింది. కొత్తగా ఈ–పాస్‌పుస్తకాలనే అందించేందుకు సన్నద్ధమవుతోంది.

పకడ్బందీగా కొత్త పుస్తకం
ఇప్పటివరకు కొనసాగిన మాన్యువల్‌ విధానానికి పుల్‌స్టాప్‌ పడనుంది. ఇప్పుడు క్షేత్రస్తాయిలో ఆధునికీకరిస్తున్న డాటా నేరుగా సీసీఎల్‌ఏ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు నేరుగా ఈ–పాస్‌పుస్తకం అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా జరిగితే కొంతమంది ఇంటి అడ్రస్‌లు మార్పులు ఉంటే అవి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్ల ద్వారానే లబ్ధిదారులకు అందించాలా.. లేక ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే అవకాశం కల్పించాలా.. అనే దానిపై చర్చిస్తోంది. ఇక ఈ–పాస్‌ పుస్తకం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. దీనిపైన అధికారుల సంతకాలు, పట్టాదారు వివరాలు డిజిలైజ్డ్‌ అయి వస్తాయి. వీటిని మార్చడానికి బోగస్‌ చేయడానికి వీలు లేదు. ఈ పుస్తకం చినగడం, మంటల్లో వేసిన కాలిపోవడం వంటివి జరగకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈపుస్తకాలు యూనిక్‌ కోడ్‌ ఆధారంగా జారీ కానున్నాయి. సర్వే నంబర్, 1బి ఖాతా సంఖ్యతో తహసీల్దార్, ఆర్డీవో డిజిటల్‌ సంతకంతో ఈ–పాస్‌బుక్‌ను ముద్రించనున్నారు.

నిలిచిన పాస్‌పుస్తకాల జారీ
ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ–పాస్‌పుస్తకాల నేపథ్యంలో జిల్లాలో మాన్యువల్‌గా పాస్‌బుక్‌లను ఇవ్వడం నిలిపివేశారు. అయితే రైతులకు రుణాలు కావాలంటే బ్యాంకుల్లో పాస్‌పుస్తకాలను చూపడం తప్పనిసరి. ప్రస్తుత సీజన్‌లో రైతులు రుణాల కోసం బ్యాంకుల వెంట తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని మండలాల్లో రైతులకు మాన్యువల్‌గా పాస్‌ పుస్తకాలను అందిస్తున్నారు. ఇకనుంచి మాత్రం పూర్తిస్థాయిలో ఈ–పాస్‌పుస్తకాలనే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ప్రయత్నంతోనైనా ఏళ్ల తరబడి నడుస్తున్న నకిలీ పట్టా పాస్‌ పుస్తకాల అక్రమాలకు తెరపడాలని రైతులు ఆశిస్తున్నారు.

త్వరలో అందుబాటులోకి..
ప్రభుత్వం ఈ–పాస్‌పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పాస్‌ పుస్తకాల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే ఈ–పాస్‌ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. బోగస్‌ పుస్తకాలకు కళ్లెం వేసేందుకు డిజిటలైజ్డ్‌ ఈ–పాస్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి.

నిర్మల్‌ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు :
02(నిర్మల్, భైంసా)
రెవెన్యూ మండలాలు : 19
ప్రస్తుతం సాగుభూమి : 3లక్షల 64వేల ఎకరాలు
రైతుల సంఖ్య : లక్షా 35వేల 565 మంది (సమగ్ర సర్వే ప్రకారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement