అది నవంబర్ 8, 2016.. రాత్రి 8 గంటలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియా ముందుకు వచ్చారు. ఉరుము లేని పిడుగులా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మన దేశంలో చెలామణిలో ఉన్న నోట్లలో 86శాతం ఉన్న పెద్ద నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేయడంతో జాతి యావత్తూ గందరగోళానికి లోనైంది. పాత నోట్లు మార్చుకోవడానికి 50 రోజులు సమయం ఇచ్చినా సామాన్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. గంటల తరబడి బ్యాంకు క్యూ లైన్లలో నిల్చొని పడరాని పాట్లు పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఎన్నో గ్రామాల్లో ప్రజలు, రైతులు, చిన్న పరిశ్రమలు, రోజువారీ కూలీలు, కార్మికులు విలవిలలాడిపోయారు.
నగదు లావాదేవీలపైనే అధికంగా ఆధారపడే వ్యవసాయ రంగం, అసంఘటిత రంగంపై నోట్లరద్దు ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా దేశ సంక్షేమం కోసమే మోదీ ఇదంతా చేస్తున్నారని జనం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచారు. నరేంద్ర మోదీపై ప్రజలు ఎంత భరోసా ఉంచారో నోట్ల రద్దు జరిగిన నాలుగు నెలల్లోనే 2017, ఫిబ్రవరిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. నోట్ల రద్దు ఒక అనవసర ప్రహసనమని విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని మెజార్టీని బీజేపీకి కట్టబెట్టారు.
నోట్ల రద్దు లక్ష్యాలేంటి ?
అవినీతిని అంతం చేసి బ్లాక్ మనీని బయటకు తీసుకురావడం నకిలీ నోట్ల దందాను అరికట్టడం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడం ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల వరకు బ్లాక్ మనీ ఉంటుందని, దానిని రొటేషన్‌లోకి తీసుకురావడం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునని మోదీ సర్కార్ భావించింది.
అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి
♦ నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బొక్క బోర్లా పడింది. తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. భారతదేశంలో బ్లాక్ మనీ బంగారం, భూముల రూపంలోనే ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడానికి ఎంతో కాలం పట్టం లేదు. నోట్ల రద్దు జరిగిన రెండేళ్ల తర్వాత ఆర్థిక రంగంపై పడిన దుష్ప్రభావాలు ఒక్కొక్కటి బయటపడసాగాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సర్వేలు నోట్ల రద్దు వల్ల పైసా ఉపయోగం లేదని పెదవి విరిచాయి.
♦ నోట్ల రద్దు జరిగిన కేవలం 35 రోజుల్లోనే 99.3 శాతం కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017–18 వార్షిక నివేదిక వెల్లడించింది.
♦ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏకంగా 7.3శాతం వరకు జీడీపీ పడిపోయిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
♦ నోట్ల రద్దు కారణంగా నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు చేసిన ఫలితాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2011–12లో 5 శాతం మాత్రమే ఉన్న నిరుద్యోగ సమస్య 2017–18 వచ్చేసరికి 17.5శాతానికి పెరిగిపోయింది.
♦ భారత స్థూల జాతీయోత్పత్తి నోట్ల రద్దుకు ముందు 8 శాతం ఉంటే ఆ తర్వాత రెండేళ్లలో 2 శాతం పడిపోయిందని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ సర్వీస్ అంచనా వేసింది.
♦ అయితే నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు మాత్రం 150 శాతం వరకు పెరిగాయి.
ఎన్నికల్లో ప్రభావం ఎంతవరకు ?
నోట్ల రద్దుపై మొదట్లో ఉన్నంత సానుకూలత రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో కనిపించలేదు. సీఎస్‌డీఎస్ సర్వేలో నోట్ల రద్దు దేశానికి అవసరమా అంటే 53 శాతం మంది అవసరమేనని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏదో ఒకటి చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు ప్రభావం ప్రత్యక్షంగా ఎంతవరకు ఉందో అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మిగిలింది. కానీ పరోక్షంగా దాని ప్రభావం తీవ్రంగానే పడింది. చిన్న వర్తకులు, కార్మికులు, రైతులు విలవిలలాడారు. అదే సీఎస్‌డీఎస్ సర్వేలో 2017లో వర్తకుల్లో 50 శాతం మంది ఎన్డీయేకి అనుకూలంగా ఉంటే 2018 వచ్చేసరికి వారి సంఖ్య 48 శాతానికి పడిపోయింది. రైతుల మద్దతు ఎన్డీయేకి 2017 మేలో 49శాతం ఉంటే, ఆ తర్వాత ఏడాదికి 37శాతానికి తగ్గిపోయింది. నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని జీఎస్టీ వల్ల పూడ్చుకోవచ్చునని నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు పుల్వామా దాడుల తర్వాత మొత్తంగా రాజకీయ చిత్రం మారిపోయి నోట్ల రద్దుని పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment