- విజయవాడ డివిజన్‌లో 142 షాపులే కేటాయింపు
- మిగిలిన 20 షాపులకు మళ్లీ గజిట్ విడుదల
- 7వ తేదీ లాటరీ
సాక్షి, విజయవాడ : వైన్ షాపుల కేటాయింపుల ద్వారా ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా సొమ్ము చేరింది. విజయవాడ డివిజన్ పరిధిలోని వైన్ షాపుల కేటాయింపు ద్వారా రూ 62.13 కోట్లు ఆదాయం లభించింది. డివిజన్‌లోని 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న 162 వైన్ షాపులకు గత నెలలో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ప్రకియలో తొలి విడత షాపులు కేటాయించారు. 162 షాపులకు గానూ142 షాపులకు మాత్రమే దరఖాస్తులొచ్చాయి. దీంతో 142 షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించారు.
గత నెల 22 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ 28న లాటరీ నిర్వహించారు. 142 షాపులకు గానూ 2452 ధరఖాస్తులందాయి. అత్యధికంగా తిరువూరులోని 11 వైన్‌సాపుల కోసం 479 దరఖాస్తులొచ్చాయి. కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.6.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక వైన్ షాపుల లెసైన్స్ ఫీజుల ద్వారా విజయవాడ డివిజన్లో 62,13,50,000కోట్లు ఆదాయం లభించింది.
ఈ మొత్తాన్ని వ్యాపారులు మూడు విడతలుగా ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో షాపు దక్కగానే ముందు ఒక విడత మొత్తం చెల్లించి షాపును ఖరారు చేసుకోవాలి. దీంతో తొలివిడతగా 20.71 కోట్లు వ్యాపారుల ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు చెల్లించారు. దీనిని ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.
రెండో గజిట్ విడుదల ఎన్‌వి.రమణ
విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న 20 వైన్‌షాపులకు సంబంధించి రెండో నోటిఫికేషన్ విడుదల చేశామని విజయవాడ ఎక్సైజ్ సూపరిండెంటెంట్ ఎన్‌వి. రమణ సాక్షికి తెలిపారు. డివిజన్‌లో మొదటి గజిట్ ద్వారా 162 షాపులకు గానూ 142 షాపులకు దరఖాస్తులొచ్చాయని వాటిని పరిశీలించి షాపులను కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ అదేశాలతో రెండో విడతలో మిగిలిన 20 షాపులకు గజిట్ విడుదల చేశామని, 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 7వ తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి షాపులు కేటాయిస్తామని చెప్పారు.